Saturday, February 24, 2018

నీలకంఠ వైభవం - 15

8-231-క.
నీకంటె నొండెఱుంగము; 
నీకంటెం బరులు గావ నేరరు జగముల్; 
నీకంటె నొడయఁ డెవ్వఁడు
లోకంబుల కెల్ల నిఖిలలోకస్తుత్యా!


భావము:
సమస్తలోకాల యందూ కీర్తింపబడు స్వామీ! శివా! నీవే మాకు దిక్కు. నిన్ను తప్ప మరెవ్వరినీ ఆశ్రయింపము. నీవు తప్ప మరెవ్వరూ లోకాలను కాపాడలేరు. నిన్ను మించిన గొప్పవాడు మరెవ్వరూ లేరు.


http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=31&padyam=231


:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::
నీలకంఠ వైభవం - 14

8-230-క.
లంపటము నివారింపను
సంపదఁ గృపజేయ జయము సంపాదింపం
జంపెడివారి వధింపను
సొంపారఁగ నీక చెల్లు సోమార్ధధరా!

భావము:
అర్థచంద్రుని అలంకారంగా ధరించిన మహా ప్రభూ! పరమేశ్వరా! ఈ ఆపదను తొలగించడానికి, ఆనందం చేకూర్చడానికీ, జయాన్ని సంపాదించడానికి, క్రూరులను హతమార్చడానికి నీవు మాత్రమే సమర్థుడవు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=31&padyam=230

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

Tuesday, February 20, 2018

నీలకంఠ వైభవం - 13

8-229-మత్త.
బాహుశక్తి సురాసురుల్ చని పాలవెల్లి మథింప హా
లాహలంబు జనించె నేరి కలంఘ్య మై భువనంబు గో
లాహలంబుగఁ జేసి చిచ్చును లాగముం గొని ప్రాణిసం
దోహమున్ బ్రతికింపవే దయ దొంగలింపఁగ నీశ్వరా!

భావము:
ఓ పరమేశ్వరా! దేవతలూ రాక్షసులూ కలిసి భుజబలాలు వాడి పాల సముద్రాన్ని మథించారు. దానిలోనుంచి హాలాహలం అనే మహా విషం పుట్టింది. లోకాలను క్షోభ పెడుతోంది. అతలాకుతలం చేస్తోంది. ఎవరూ దానిని అడ్డుకోలేకుండా ఉన్నారు. అతిశయించిన దయ జాలువారగా ప్రాణికోటిని అనుగ్రహించు. ఆ హాలాహల విషాన్ని పరిగ్రహించు. 
'శివా! నీ దయ అతిశయించునట్లు, వికసించునట్లు ప్రకాశింప జేయవయ్యా అలా దయాసాగరా నీ దయ వర్షించకపోతే లోకాలు ఈ హాలాహల విషాగ్నికి కాగిపోతాయయ్యా.' ఇంతటి చిక్కనైన భావాన్ని 'దయదొంగలింపన్' (దయ + తొంగలింపగా) కాపాడవయా అనే భావ ప్రకటనతో అలవోకగా చెప్పిన పోతనామాత్యులకు ప్రణామములు.:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::
Sunday, February 18, 2018

నీలకంఠ వైభవం - 12

8-228-క.
సదసత్తత్త్వ చరాచర
సదనం బగు నిన్నుఁ బొగడ జలజభవాదుల్
పెదవులుఁ గదలుప వెఱతురు
వదలక నినుఁ బొగడ నెంతవారము రుద్రా!

భావము:
దేవా! శంకరా! సదసద్రూపమైన ఈ చరాచర జగత్తునకు మూలాధారం నీవు. బ్రహ్మాదులు సైతం నిన్ను ప్రస్తుతించడానికి భయపడి పెదవులు కదల్చలేరు. అంతటి నిన్ను స్తుతించడానికి మేము ఏమాత్రం సరిపోము కదా!

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=31&padyam=228

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

నీలకంఠ వైభవం - 11

8-227-ఆ.
మూఁడు మూర్తులకును మూఁడు లోకములకు
మూఁడు కాలములకు మూల మగుచు
భేద మగుచుఁ దుది నభేదమై యొప్పారు 
బ్రహ్మ మనఁగ నీవ ఫాలనయన!


భావము:
నుదుట కన్ను గల ముక్కంటి! శంకరా! ముగ్గురు మూర్తులకూ, మూడులోకాలకూ, మూడు కాలాలకూ నీవే మూలం. మొదట భేదంతో కనిపించినా, చివరకి అభేద స్వరూపంతో ఒప్పారుతుండే పరబ్రహ్మవు నీవే.:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::
Friday, February 16, 2018

నీలకంఠ వైభవం - 10

8-226-సీ.
తలఁపఁ బ్రాణేంద్రియ ద్రవ్యగుణస్వభా; 
వుఁడవు; కాలక్రతువులును నీవ; 
సత్యంబు ధర్మ మక్షరము ఋతంబును; 
నీవ ముఖ్యుండవు నిఖిలమునకు; 
ఛందోమయుండవు సత్త్వరజస్తమ; 
శ్చక్షుండవై యుందు; సర్వరూప
కామ పురాధ్వర కాలగరాది భూ; 
తద్రోహభయము చోద్యంబు గాదు;
8-226.1-తే.
లీలలోచనవహ్ని స్ఫులింగ శిఖల
నంతకాదులఁ గాల్చిన యట్టి నీకు
రాజఖండావతంస! పురాణ పురుష! 
దీన రక్షక! కరుణాత్మ! దేవ దేవ!

భావము:
చంద్ర కళను శిరసున ధరించు వాడా! పురాణ పురుషుడా! దీనులను రక్షించువాడా! దయామయా! దేవ దేవ! తరచి చూస్తే ప్రాణమూ, ఇంద్రియాలూ, ద్రవ్యమూ, గుణాలూ సర్వం నీ స్వభావసిద్ధాలు. కాలమూ యజ్ఞమూ నీవే; సత్యమూ, ధర్మమూ, ఓంకారమూ, మోక్షమూ నీవే; అన్నింటికి నీవే ఆధారం; వేదరూపుడవు నీవే; సత్త్వము, రజస్సు, తమస్సు అనే త్రిగుణాలూ నీవు నేత్రాలుగా కలిగి ఉంటావు; సమస్తమైన రూపాలు నీవే; లీలగా చూసే నీ మూడోకన్ను చూపుల మంటలతో యమాదులను సైతం భస్మం చేస్తావు; మన్మథుడు, త్రిపురాసురులు, దక్షయజ్ఞం, కాలకూటవిషం మున్నగు సర్వ భాతాల వలన నీకు హాని కలుగుతుంది అని సంకోచం అన్నది లేకపోవటంలో ఆశ్చర్యం ఏమాత్రం లేదు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=31&padyam=226

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

నీలకంఠ వైభవం - 9

8-225-క.
కొందఱు గలఁ డందురు నినుఁ; 
గొందఱు లేఁ డందు; రతఁడు గుణి గాఁ డనుచుం
గొందఱు; గలఁ డని లేఁ డని
కొందల మందుదురు నిన్నుఁ గూర్చి మహేశా!

భావము:
ఓ పరమేశ్వరా! మహాప్రభూ! కొందరు నీవు ఉన్నావు అంటారు. కొందరు నీవు లేవు అంటారు. ఇంకా కొందరు నీవు సగుణరూపుడవు అంటారు. మరికొందరు నీవు ఉన్నావో లేవో అనే సందేహాలతో కొట్టుమిట్టాడుతుంటారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=31&padyam=225

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::