Saturday, June 17, 2017

దక్ష యాగము - 63:

4-143-క.
"అనఘ! మహాత్ముం డగు వా
మనుఁ డా కశ్యపునకొగి నమస్కారము చే
సినగతి నజునకు నభివం
దన మొగిఁ గావించె హరుఁడు దద్దయుఁ బ్రీతిన్.
4-144-తే.
అంత రుద్రానువర్తు లైనట్టి సిద్ధ
గణ మహర్షి జనంబులు గని పయోజ
గర్భునకు మ్రొక్కి; రంత నా కమలభవుఁడు
శర్వుఁ గని పల్కె మందహాసంబుతోడ.

టీకా:
అనఘ = పుణ్యుడు; మహాత్ముండు = మహాత్ముడు; అగు = అయిన; వామనుడు = వామనుడు; ఆ = ఆ; కశ్యపున్ = కశ్యపుని; కున్ = కి; ఒగిన్ = చక్కగ; నమస్కారము = నమస్కారము; చేసిన = చేసిన; గతిన్ = విధముగ; అజున్ = బ్రహ్మదేవునికిన్; అభివందనము = నమస్కారము; ఒగిన్ = చక్కగ; కావించెన్ = చేసెను; హరుడు = శివుడు; దద్ధయున్ = మిక్కిలి; ప్రీతిన్ = ప్రీతితో. అంత = అంతట; రుద్ర = రుద్రుని; అనువర్తులు = అనుచరులు; ఐనట్టి = అయినట్టి; సిద్ధ = సిద్ధుల; గణ = సమూహము; మహర్షి = మహర్షులైన; జనంబులు = వారు; కని = చూసి; పయోజగర్భున్ = బ్రహ్మదేవుని {పయోజగర్భుడు - పయోజము (పద్మము)న పుట్టినవాడు, బ్రహ్మదేవుడు}; కున్ = కి; మ్రొక్కిరి = నమస్కరించిరి; అంతన్ = అంతట; ఆ = ఆ; కమలభవుడు = బ్రహ్మదేవుడు {కమలభవుడు - కమలము (పద్మము)న భవుడు (పుట్టినవాడు), బ్రహ్మదేవుడు}; శర్వున్ = శివుని; కని = చూసి; పల్కె = పలికెను; మందహాసంబు = చిరునవ్వు; తోడన్ = తోటి.

భావము:
పుణ్యాత్ముడవైన ఓ విదురా! మహాత్ముడైన వామనుడు కశ్యపునకు నమస్కరించినట్లుగా శివుడు బ్రహ్మకు ఇంతో ఇష్టంతో నమస్కారం చేశాడు. అప్పుడు శివుని అనుచరులైన సిద్ధగణాలు, మునులు బ్రహ్మను చూచి నమస్కరించారు. ఆ తరువాత బ్రహ్మ శివుణ్ణి చూచి చిరునవ్వుతో ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=8&padyam=144

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

No comments: