Thursday, March 9, 2017

కాళియమర్దనము – బాలుం డీతఁడు


:చదువుకుందాం భాగవతం : : బాగుపడదాం మనం అందరం:


10.1-687-శా.
బాలుం డీతఁడు మంచివాఁ డనుచుఁ జెప్పన్ రాము క్రూరుండు దు
శ్శీలుండౌ నవు నైన నేము సుభగశ్రీఁ బాసి వైధవ్య దు
ష్టాలంకారముఁ బొంద నోడెద మనాథాలాప మాలింపవే?
చాలున్ నీ పద తాండవంబు; పతిబిక్షం బెట్టి రక్షింపవే?
10.1-688-ఉ.
కుల మయ్యె భోగ మిదె యౌదల లన్నియు వ్రస్సెఁ బ్రాణముల్
రాలఁ బోకలం బొలిసె రాయిడి పెట్టక మా నిజేశుపై
నీ రుణాకటాక్షములు నిల్పఁగదే తగ నో! సమస్త లో
కైశరణ్య! యో! యభయకారణ! యో! కమలామనోహరా!

టీకా:
బాలుండు = అమాయకుడు; ఈతడు = ఇతను; మంచివాడు = యోగ్యుడు; అనుచున్ = అని; చెప్పన్ = చెప్పుటకు; రాము = వచ్చినవారముకాము; క్రూరుండు = చెడ్డమనసుకలవాడు; దుశ్శీలుండున్ = చెడునడవడికగలవాడు; ఔనవున్ = అవును; ఐనన్ = అయినప్పటికి; నేము = మేము; సుభగ = అయిదవతనమను; శ్రీన్ = సంపదను; పాసి = తొలగి; వైధవ్య = వైధవ్యమునెడి; దుష్ట = చెడ్డ; అలంకారమున్ = అలంకారహీనమును; పొందన్ = పొందుటకు; ఓడెదము = భయపడుచున్నాము; అనాథ = నీవుతప్పదిక్కులేనివారి; ఆలాపమున్ = వేడ్కొనుటను; ఆలింపవే = వినుము; చాలున్ = ఇక చాలును; నీ = నీ యొక్క; పద = అడుగుల; తాండవంబు = లయబద్దప్రక్షేపములు; పతిబిక్షన్ = భర్త అనెడి బిక్షను; పెట్టి = అనుగ్రహించి; రక్షింపవే = కాపాడుము.
ఆకులము = నలగినది; అయ్యెన్ = అయినది; భోగము = ఇతనిదేహము; ఇదె = ఇదిగో; ఔదలలు = పడగలు; అన్నియున్ = సర్వము; వ్రస్సెన్ = చిట్లెను; ప్రాణముల్ = పంచప్రాణవాయువులు; రాకలన్ = ఉఛ్వాశములు; పోకలన్ = నిశ్వాసములు; పొలిసె = క్షీణించెను; రాయిడి = బాధలు; పెట్టక = పెట్టకుండ; మా = మా యొక్క; నిజేశు = భర్త; పైన్ = మీద; నీ = నీ యొక్క; కరుణా = దయకలగిన; కటాక్షములున్ = కడగంటిచూపులను; నిల్పగదే = ఉంచుము; తగన్ = నిండుగా; ఓ = ఓ; సమస్తలోకైకశరణ్య = కృష్ణా {సమస్తలోకైకశరణ్యుడు - సమస్తమైన చతుర్దశభువనములను ఒక్కడే ఐన రక్షకుడు, విష్ణువు}; ఓ = ఓ; అభయకారణ = కృష్ణా {అభయకారణుడు - భక్తులకు భయములేకుండ చేయుటకు హేతువు ఐనవాడు, విష్ణువు}; ఓ = ఓ; కమలామనోహరా = కృష్ణా {కమలామనోహరుడు - కమల (లక్ష్మీదేవికి) మనోహరుడు (భర్త), విష్ణువు}.

భావము:
ఈ కాళీయుడు అమాయకుడు, మంచివాడు అనడం లేదు. నిజమే! ఇతడు క్రూరుడు, దుష్టుడు. అయినా మేము సౌభాగ్యాన్ని పోగొట్టుకొని అసహ్య రూపాలతో ఉండే వైధవ్యం పొందలేము. మేము అనాథలము. మా దీనాలాపాలను మన్నించు. ఇక నీ పాదతాడనాలు చాలించు. పతిబిక్ష పెట్టి మమ్ము పాలించు!
అన్ని లోకాలలోను శరణు ఇవ్వగల ఒకే ఒక్క ప్రభువా! ఓ అభయమును ఇచ్చే దేవా! ఓ లక్ష్మీపతీ! ఇతని దేహమంతా నలిగి చితికిపోయింది. తలలు పగిలిపోయాయి. ప్రాణాలు వస్తుతున్నాయా, పోతున్నాయా అన్నట్లు ఉన్నాడు. ఇంకా బాధపెట్టకుండా, మా భర్త మీద నీ దయ గల చూపులు ప్రసరించి రక్షించు.


No comments: