Wednesday, November 30, 2016

వామన వైభవం - 40:

8-532-వ.
కని దానవేంద్రుని హయమేధ వాటి దఱియం జొచ్చు నయ్యవసరంబున.
8-533-శా.
శంభుండో హరియో పయోజభవుఁడో చండాంశుఁడో వహ్నియో
దంభాకారత వచ్చెఁ గాక ధరణిన్ ధాత్రీసురుం డెవ్వడీ
శుంద్యోతనుఁ డీ మనోజ్ఞ తనుఁ డంచున్ విస్మయభ్రాంతులై
సంభాషించిరి బ్రహ్మచారిఁ గని తత్సభ్యుల్ రహస్యంబుగన్.




టీకా:

కని = చూసి; దానవేంద్రుని = బలిచక్రవర్తి; హయమేధవాటిన్ = అశ్వమేధయాగశాలను; దఱియంజొచ్చు = చేరవచ్చెడి; ఆ = ఆ; అవసరంబునన్ = సమయమునందు; శంభుండో = పరమశివుడో; హరియో = విష్ణుమూర్తియో; పయోజభవుడో = బ్రహ్మదేవుడో {పయోజభవుడు - పయోజ (పద్మమున) భవుడు (పుట్టినవాడు), బ్రహ్మ}; చండాంశుడో = సూర్యభగవానుడో {చండాంశుడు - చండ (తీవ్రమైన) అంశుడు (కిరణములు కలవాడు), సూర్యుడు}; వహ్నియో = అగ్నిదేవుడో; దంభ = కపట; ఆకారతన్ = వేషముతో; వచ్చెన్ = వచ్చెను; కాక = కాకపోయినచో; ధరణిన్ = భూమిపైన; ధాత్రీసురుండు = బ్రాహ్మణుడు {ధాత్రీసురుడు - దాత్రీ (భూమిపైని) సురుడు (దేవత), విప్రుడు}; ఎవ్వడు = ఎవరు; ఈ = ఇంత; శుంభత్ = ప్రశస్తముగా; ద్యోతనుడు = ప్రకాశించువాడు; ఈ = ఇంత; మనోజ్ఞ = అందముగానున్న; తనుడు = దేహముగలవాడు; అంచున్ = అనుచు; విస్మయ = ఆశ్చర్యముతో; భ్రాంతులు = భ్రాంతిలోపడినవారు; ఐ = అయ్యి; సంభాషించిరి = మాట్లాడుకొనిరి; బ్రహ్మచారిన్ = వామనుని; కని = చూసి; తత్ = అక్కడి; సభ్యుల్ = సభలోనివారు; రహస్యంబుగన్ = రహస్యముగా.

భావము:

ఆ వైభోగం అంతా చూస్తూ, వామనుడు బలిచక్రవర్తి యజ్ఞవాటికను సమీపించాడు. అలా వేంచేసిన వామనుని చూసి, సభలోనివారు “శివుడో, విష్ణువో, బ్రహ్మయో, సూర్యుడో, అగ్నియో ఇలా మారు వేషంతో వచ్చి ఉండవచ్చు. ప్రపంచంలో ఇంతటి కాంతి అందమూ ఉండే బ్రహ్మచారి ఎవరుంటారు.” అనుకుంటూ ఆశ్చర్యంతో చకితులై రహస్యంగా గుసగుసలాడారు.




: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Tuesday, November 29, 2016

వామన వైభవం - 39:

8-531-శా.
చండస్ఫూర్తి వటుండుఁ గాంచె బహుధాజల్పన్నిశాటంబు, ను
ద్దండాహూత మునీభ్యబిభ్యదమృతాంధస్సిద్ధకూటంబు, వే
దండాశ్వధ్వజనీ కవాటము, మహోద్యద్ధూమ సంఛన్న మా
ర్తాండస్యందన ఘోటమున్, బలిమఖాంతర్వేది కావాటమున్.

టీకా:
చండ = తీవ్రమైన; స్పూర్తిన్ = తేజస్సుగలవాడు; వటుండు = బ్రహ్మచారి; బహుధా = పెక్కవిధములుగ; జల్పన్ = వాగెడివారలను {జల్పనము - ఉపయపక్తముకాని పెక్కు మాటలాడుట}; నిశాటంబునున్ = రాక్షసులను; ఉద్దండ = ఉద్దండులైన; ఆహూత = పిలువబడిన; ముని = మునులలో; ఇభ్య = శ్రేష్ఠులవలన; బిభ్యత్ = బెదురుచున్న; అమృతాంధస్ = దేవతల {అమృతాంధస్ - అమృతము ఆహారముగా కలవారు, దేవతలు}; సిద్ధ = సిద్ధుల; కూటంబున్ = సమూహములు కలది; వేదండ = ఏనుగులు; అశ్వ = గుర్రములు; ధ్వజనీ = సేనలు; కవాటమున్ = ద్వారమువద్దనున్నది; మహా = మిక్కలి; ఉద్యత్ = చెలరేగుచున్న; ధూమ = పొగలతో; సంఛన్న = కప్పబడిన; మార్తాండ = సూర్యుని; స్యందన = రథముయొక్క; ఘోటమున్ = గుర్రములుకలది; బలి = బలి యొక్క; మఖ = యజ్ఞముయొక్క; అంతర = అంతర్భాగపు; వేదికావాటమున్ = సభాస్థలమును.

భావము:
బలిచక్రవర్తి యాగసాలను సందర్శించాడు. అలా వామనుడు చేరిన బలి యాగసాలలో రాక్షసులు పెక్కువిధాలైన పెద్దపెద్ద సందడులు చేస్తున్నారు. ఆ యజ్ఞంలో పాల్గొన్న ఉద్దండులైన మునులను చూసి దేవతలూ సిద్ధులూ భయపడుతున్నారు. ద్వారానికి ముందువైపు స్థలం ఏనుగులూ గుర్రాలూ సైన్యాలూతో నిండిపోయి ఉంది. అక్కడి యజ్ఞకుండాల పొగలతో సూర్యుని రధం గుఱ్ఱాలు పూర్తిగా కప్పబడి పోతున్నాయి.
http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=71&Padyam=531

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Monday, November 28, 2016

వామన వైభవం - 38:

8-529-క.
శర్మద, యమదండక్షత
వర్మద, నతి కఠిన ముక్తి వనితాచేతో
మర్మద, నంబునివారిత
దుర్మద, నర్మదఁ దరించెఁ ద్రోవన్ వటుఁడున్.
8-530-వ.
దాటి తత్ప్రవాహంబున కుత్తరతటంబు నందు.

టీకా:
శర్మద = శుభములనిచ్చునది; యమ = యముని; దండ = దండనము యొక్క; క్షత = దెబ్బల నుండి; వర్మదన్ = కవచమువంటిదానిని; అతి = మిక్కిలి; కఠిన = గట్టిదైన, గడుసుదైన; ముక్తి = ముక్తి యనెడి; వనిత = స్త్రీ యొక్క; చేతస్ = మనసు; మర్మదనంబున్ = మర్మమును తెలిపెడిది; అంబు = (తన) నీటితో; నివారిత = నివారించబడు; దుర్మదన్ = దోషములుగలది; నర్మదన్ = నర్మదానదిని; తరించెన్ = దాటెను; త్రోవన్ = దారిలో; వటుడున్ = బ్రహ్మచారి. దాటి = దాటి; తత్ = ఆ; ప్రవాహంబున్ = నదికి; ఉత్తర = ఉత్తరపు; తటంబున్ = గట్టు; అందున్ = అందు.



భావము:
నర్మదానది శుభాలను అందించేది. యమ బాధలు అనే బాణాల నుండి కవచంలా కాపాడేది; బహు గడుసుది అయిన ముక్తికాంత మనసులోని గుట్టు బయట పెట్టేది; తన నీళ్ళతో దోషాలను నివారించేది. తన దారిలో అలాంటి మహిమాన్వితమైన నర్మదానదిని వామనుడు దాటాడు. మంచి తేజస్సు గల ఆ వామనుడు నర్మదానదిని దాటి దానికి ఉత్తర తీరంలో ఉన్న .. .
http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=71&Padyam=529

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Sunday, November 27, 2016

వామన వైభవం - 37:

8-527-క.
సర్వప్రపంచ గురుభరనిర్వాహకుఁ డగుటఁజేసి నెఱిఁ జనుదేరన్
ఖర్వుని వ్రేఁగు సహింపక
నుర్వీస్థలి గ్రుంగె; మ్రొగ్గె నురగేంద్రుండున్.
8-528-వ.
ఇట్లు చనిచని

టీకా:
సర్వ = అఖిల; ప్రపంచ = లోకముల; గురు = బరువును; భర = భరించుట; నిర్వాహకుడు = చేయువాడు; అగుటన్ = అగుట; చేసి = వలన; నెఱిన్ = క్రమముగా; చనుదేర = వెశ్ళుచుండగ; ఖర్వుని = పొట్టివాని; వ్రేగున్ = భారమును; సహింపక = తట్టుకొనలేక; ఉర్వీస్థలి = భూమండలము; క్రుంగెన్ = కుంగిపోయినది; మ్రొగ్గెన్ = వంగిపోయెను; ఉరగేంద్రుండున్ = ఆదిశేషుడు. ఇట్లు = ఈ విధముగ; చనిచని = సాగిపోయి.

భావము:
భగవంతుడైన వామనుడు తన కడుపులో సమస్త లోకాలను భరించేవాడు కదా. అందుకే, అతడు ఒయ్యారంగా నడిచేటప్పుడు అతని బరువు తట్టుకోలేక భూమి కృంగిపోయింది. ఆదిశేషుడు వంగిపోయాడు. ఆ వామనమూర్తి అలా వెళ్ళి . . . .
http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=71&Padyam=527

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :



Saturday, November 26, 2016

వామన వైభవం - 36:

8-525-క.
ప్రక్షీణ దివిజ వల్లభ
రక్షాపరతంత్రుఁ డగుచు రాజీవాక్షుం
డా క్షణమున బలి యింటికి
బిక్షాగమనంబు జేసెఁ బేదఱికముతోన్
8-526-క.
హరిహరి; సిరి యురమునఁ గల
హరి హరిహయుకొఱకు దనుజు నడుగం జనియెన్;
బరహితరత మతియుతులగు
దొరలకు నడుగుటయు నొడలి తొడవగుఁ బుడమిన్.



టీకా:
ప్రక్షీణ = మిక్కిలిదీనురాలైన; దివిజవల్లభ = దేవేంద్రుని; రక్షా = కాపాడుటయందు; పరతంత్రుడు = నిమగ్నమైనవాడు; అగుచున్ = అగుచు; రాజీవాక్షుండు = హరి; ఆ = ఆ; క్షణమునన్ = వెంటనే; బలి = బలి యొక్క; ఇంటికిన్ = నివాసమున; కిన్ = కు; బిక్షా = యాచించుటకు; ఆగమనంబున్ = చేరుటను; చేసెన్ = చేసెను; పేదఱికము = పేదరికము; తోను = తోటి.
                         హరిహరి = అయ్యయ్యో; సిరి = లక్ష్మీదేవి; ఉరమునన్ = వక్షస్థలమున; కల = కలిగిన; హరి = విష్ణుమూర్తి; హరిహయు = ఇంద్రుని; కొఱకున్ = కోసము; దనుజున్ = రాక్షసుని; అడుగన్ = అడుగుటకు; చనియెన్ = బయలుదేరెను; పర = ఇతరులకు; హిత = మేలుచేయుటయందు; రత = ప్రీతికల; మతి = బుద్ధి; యుతుల = కలవారు; అగు = అయిన; దొరల్ = దొడ్డబుద్ధిగలవారల; కున్ = కు; అడుగుటయున్ = యాచించుటకూడ; ఒడలి = దేహ; తోడవు = అలంకారము; అగున్ = అయి ఉండును; పుడమిన్ = లోకమునందు.

భావము:
వామనుడు బాగా బక్క చిక్కిన దేవేంద్రుడిని కాపాడాలి అనుకున్నాడు. వెంటనే బలిచక్రవర్తిని దానం అడగడానికి నిశ్చయించుకుని, పేదరికాన్ని చూపిస్తూ బలి నివాసానికి బయలుదేరాడు.
ఔరా! రొమ్మున లక్ష్మీదేవి కలిగిన మహా సంపన్నుడు విష్ణుమూర్తి. అయినా, అతడు ఇంద్రుడి కోసం బలిని బిచ్చమడగడానికి ప్రయాణమై వెళ్ళాడు. ఇతరులకు మేలుచేసే ఉద్దేశంతో బిచ్చమెత్తడం కూడా గొప్పవారికి ఒక అలంకారమే కాబోలు ఈ భూలోకంలో.


http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=71&Padyam=525

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Friday, November 25, 2016

వామన వైభవం - 35:

8-523-మ.
"కలరున్ దాతలు; నిత్తురున్ ధనములుం; గామ్యార్థముల్ గొంచు వి
ప్రులు నేతెంతురు; గాని యీవిని బలిం బోలన్ వదాన్యుండు లేఁ
డలఘుండై యొనరించె నధ్వరశతం బాభార్గవానుజ్ఞచే; 
బలి వేఁడం బడయంగ వచ్చు బహుసంపల్లాభముల్ వామనా! "
8-524-వ.
అని తెలియంజెప్పిన బ్రాహ్మణులవచనంబు లాలకించి లోకంబులకుం బ్రీతి పుట్టింపఁ బయనంబై లాభవచనంబులుఁ గైకొని తల్లిఁదండ్రుల వీడ్కొని శుభముహూర్తంబునం గదిలి.

టీకా:
కలరున్ = ఉన్నారు; దాతలున్ = దాతలు; ఇత్తురున్ = ఇచ్చెదరు; ధనములున్ = సంపదలను; కామ్య = కోరిన; అర్థముల్ = సంపదలను; కొంచున్ = తీసుకొనుచు; విప్రులు = బ్రాహ్మణులు; ఏతెంతురు = వస్తుంటారు; కాని = కాని; ఈవిని = దానమిచ్చుగుణమున; బలిన్ = బలిచక్రవర్తితో; పోలన్ = సరిపోలగల; వదాన్యుండు = దాత; లేడు = లేడు; అలఘుండు = గొప్పవాడు; ఐ = అయ్యి; ఒనరించెన్ = చేసెను; అధ్వర = యాగములు; శతంబున్ = నూరింటిని (100); ఆ = ఆ; భార్గవ = శుక్రాచార్యుని {భార్గవుడు - భర్గుని పుత్రుడు, శుక్రుడు}; అనుజ్ఞ = అనుమతి; చేన్ = తో; బలిన్ = బలిని; వేడన్ = యాచించినచో; పడయంగవచ్చున్ = పొందవచ్చును; బహు = అనేకమైన; సంపత్ = సంపదలు; లాభముల్ = లభించుటను; వామనా = వామనుడా. అని = అని; తెలియన్ = తెలియునట్లు; చెప్పిన = చెప్పగా; బ్రాహ్మణుల = విప్రుల; వచనంబులన్ = మాటలను; ఆలకించి = విని; లోకంబుల్ = లోకముల; కున్ = కు; ప్రీతి = మేలు; పుట్టింపన్ = కలిగించుటకై; పయనంబు = ప్రయాణము; ఐ = అయ్యి; లాభవచనంబులు = ఆశీర్వాదములు; కైకొని = తీసుకొని; తల్లిదండ్రులన్ = తల్లిదండ్రులనుండి; వీడ్కొని = పోవననుజ్ఞపొంది; శుభ = శుభకరమైన; ముహూర్తంబునన్ = సమయమునందు; కదిలి = బయలుదేరి.

భావము:
“ఓ! వామనుడా! ధనమిచ్చేదాతలు అనేకులు ఉన్నారు. బ్రాహ్మణులు కోరిన సంపదలను పొందుతున్నారు. కానీ ఆ దాతలలో బలిచక్రవర్తితో సమానమైన మహాదాత లేడు. అతను శుక్రాచార్యుని అనుమతితో గొప్ప యాగాలు నూరు చేసాడు. అతనిని అడిగితే నీవు గొప్ప సంపద సంపాదించుకోవచ్చు.” ఆ విధంగా తెలియపరచిన బ్రాహ్మణుల మాటలు విని లోకాలకు మేలు కలిగించడంకోసం వామనుడు ప్రయాణం అయ్యాడు. మంచి ముహుర్తములో, పెద్దల దీవనలూ తల్లితండ్రుల అనుమతి పొంది బయలుదేరాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=70&Padyam=523

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Thursday, November 24, 2016

వామన వైభవం - 34:

8-520-వ.
ఇట్లు కృతకృత్యుండైన మాయామాణవకుండు దేశాంతర సమాగతు లగు బ్రాహ్మణులం గొందఱ నవలోకించి యిట్లనియె.
8-521-క.
వత్తురె విప్రులు? వేఁడఁగ
నిత్తురె దాతలును వేడ్క నిష్టార్థములం?
దెత్తురె మీరును సంపద?
లిత్తెఱఁగున దాన వీరుఁ డెవ్వఁడొ చెపుడా.
8-522-వ.
అనిన నఖిల దేశీయు లగు భూసురు లిట్లనిరి.

టీకా:
ఇట్లు = ఈ విధముగ; కృతకృత్యుండు = కార్యక్రమముపూర్తిచేసినవాడు; ఐన = అయిన; మాయా = కపట; మాణవకుడు = బాలకుడు; దేశాంతర = ఇతర ప్రాంతముల నుండి; సమాగతులు = వచ్చినవారు; అగు = అయిన; బ్రాహ్మణులన్ = విప్రులను; కొందఱన్ = కొంతమందిని; అవలోకించి = చూసి; ఇట్లు = ఇలా; అనియె = అడిగెను.
                             వత్తురె = వస్తుంటార; విప్రులు = బ్రాహ్మణులు; వేడగన్ = యాచించుటకు; ఇత్తురె = ఇస్తుంటారా; దాతలును = దానములిచ్చువారు; వేడ్కన్ = సంతోషముతో; ఇష్ట = కోరిన; అర్థములన్ = కోరికలను; తెత్తురె = తెచ్చుకొన్నారా; మీరును = మీరుకూడ; సంపదలున్ = సంపదలను; ఈ = ఈ; తెఱంగునన్ = విధమైన; దానవ = రాక్షస; వీరుడు = శూరుడు; ఎవ్వడొ = ఎవరో; చెపుడా = చెప్పండి. అనినన్ = అనగా; అఖిల = అన్ని; దేశీయులు = దేశములవారు; అగు = అయిన; భూసురులు = విప్రులు {భూసురులు - భూమిపైని దేవతలు, బ్రాహ్మణులు}; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.

భావము:
ఈ విధంగా ఉపనయనం పూర్తై కృతకృత్యుడు అయిన మాయాబ్రహ్మచారి ఇతర దేశాలనుండి వచ్చిన కొందరు బ్రాహ్మణులను చూసి ఇలా అడిగాడు.
                               “దానాలు అందుకోవడానికి బ్రాహ్మణులు దాతల చెంతకు వెళ్తున్నారా? వారు కోరిన ధనాలను దాతలు ఇస్తున్నారా? మీరుకూడా అలా ధనాన్ని తెచ్చుకుంటారా? ఈవిధంగా అర్ధులకు అడిగినది ఇచ్చే మహా దాత ఎవరో చెప్పండి.” ఇలా ధనమిచ్చే మహాదాత ఎవరో చెప్పండి అని అడిగిన, వామనుడితో వివిధ దేశాలకు చెందిన బ్రాహ్మణులు ఇలా అన్నారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=70&Padyam=520

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :



Wednesday, November 23, 2016

వామన వైభవం - 33:

8-518-క.
బిక్షాపాత్రిక నిచ్చెను
యక్షేశుఁడు వామనునకు; నక్షయ మనుచున్
సాక్షాత్కరించి పెట్టెను
బిక్షునకు భవాని పూర్ణబిక్ష నరేంద్రా!
8-519-క.
శుద్ధబ్రహ్మర్షి సమా
రాద్ధుండై విహితమంత్రరాజిఁ జదువుచుం
బ్రోద్ధంబగు ననలంబున
వృద్ధాచారమున వటుఁడు వేల్చెన్ గడకన్!

టీకా:
బిక్షాపాత్రికన్ = చిన్నబిక్షాపాత్రను; ఇచ్చెను = ఇచ్చెను; యక్షేశుడు = కుబేరుడు; వామనున్ = వామనుని; కున్ = కి; అక్షయము = అక్షయము; అనుచున్ = అనుచు; సాక్షాత్కరించి = ప్రత్యక్షమై; పెట్టెను = పెట్టెను; బిక్షున్ = బ్రహ్మచారి; కున్ = కి; భవాని = అన్నపూర్ణాదేవి; పూర్ణ = పూర్తి; బిక్షన్ = బిక్షను; నరేంద్రా = రాజా.
శుద్ధ = పరిశుద్ధమైన; బ్రహ్మర్షి = మునీశ్వరులుచే; సమారాద్ధుండు = చక్కగాసిద్ధముచేయబడినవాడు; ఐ = అయ్యి; విహిత = శాస్త్రానుసారము; మంత్రరాజిన్ = వేదమంత్రములను; చదువుచున్ = చదువుతూ; ప్రోద్ధంబు = వెలుగుతున్నది; అగు = అయిన; అనలంబునన్ = అగ్నియందు; వృద్ధాచారమునన్ = సంప్రదాయబద్దముగా; వటుడు = బ్రహ్మచారి; వ్రేల్చెను = హోమముచేసెను; కడకన్ = నిష్ఠతో.

భావము:
పరీక్షన్మహారాజా! యక్షుల ప్రభువు అయిన కుబేరుడు వామనుడికి బిక్షాపాత్ర ఇచ్చాడు. జగన్మాత పార్వతీదేవి ప్రత్యక్షమై అక్షయం అంటూ ఆ బ్రహ్మచారికి నిండైన భిక్ష పెట్టింది.
ఆ పరిశుద్ధులైన బ్రహ్మఋషులు వామనుని ఆదరంగా ఆశీర్వదించారు. తరువాత, ఆ బ్రహ్మచారి సంప్రదాయం ప్రకారం వేదమంత్రాలు చదువుతూ, వెలిగే అగ్నిహోత్రంలో ఉత్సాహంతో హోమం చేశాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=69&Padyam=518

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Tuesday, November 22, 2016

వామన వైభవం - 32:

8-516-క.
"పురు డీ బోటికి నిందిర
పురు డంబిక గాక యొరులు పురుడే?" యనుచున్
బురుటాలికిఁ బది దినములు
పురుడు ప్రవర్తించి రెలమిఁ బుణ్యపు గరితల్.
8-517-వ.
అంత నబ్బాలునకు సంతసంబున మహర్షులు కశ్యపప్రజాపతిం బురస్కరించుకొని సముచితోపనయనకర్మ కలాపంబులు చేయించిరి; సవిత సావిత్రి నుపదేశించె, బృహస్పతి యజ్ఞోపవీతధారణంబునుఁ, గశ్యపుండు ముంజియుఁ, గౌపీనం బదితియు, ధరణి కృష్ణాజినంబును, దండంబు వనస్పతి యగు సోముండును, గగనాధిష్ఠానదేవత ఛత్రంబునుఁ, గమండలువు బ్రహ్మయు, సరస్వతి యక్షమాలికయు, సప్తర్షులు కుశపవిత్రంబులు నిచ్చిరి; మఱియును.

టీకా:
పురుడు = సమానురాలు, సాటి; ఈ = ఈ; బోటి = ఇల్లాలు; కిన్ = కి; ఇందిర = లక్ష్మీదేవి; పురుడు = సమానురాలు, సాటి; అంబిక = పార్వతీదేవి; కాక = అంతే తప్పించి; ఒరులు = ఇతరులు; పురుడే = సమానులా, సాటికాగలరా; అనుచున్ = అనుచు; పురటాలి = బాలంతరాలి; కిన్ = కి; పది = పది (10); దినములు = రోజులు; పురుడు = పురుటిశుద్ధి; ప్రవర్తించిరి = నడిపించిరి; ఎలమిన్ = అతిశయించి; పుణ్యపుగరితల్ = ముత్తైదువలు.
                       అంతన్ = అంతట; ఆ = ఆ; బాలున్ = పిల్లవాని; కున్ = కి; సంతసంబునన్ = సంతోషముతో; మహర్షులు = మునీంద్రులు; కశ్యప = కశ్యపుడు యనెడి; ప్రజాపతిన్ = బ్రహ్మను; పురస్కరించుకొని = ముందుంచుకొని; సముచిత = తగినవిధముగ; ఉపనయన = వడుగు; కర్మకలాపంబులు = కార్యక్రమములు; చేయించిరి = జరిపించిరి; సవిత = సూర్యుడు; సావిత్రిన్ = గాయత్రీమంత్రమును; ఉపదేశించెన్ = ఉపదేశించెను {ఉపదేశము - అధికారదత్తపూర్వకముగ నేర్పుట}; బృహస్పతి = బృహస్పతి; యజ్ఞోపవీత = జంధ్యమును; ధారణంబును = ధరింపజేయుట; కశ్యపుండు = కశ్యపుడు; ముంజియున్ = ముంజిదర్భలు; కౌపీనంబున్ = గోచీని; అదితి = అదితి; ధరణి = భూదేవి; కృష్ణాజినంబును = నల్లజింకచర్మమును; దండంబు = దండమును; వనస్పతి = అడవికి అధిష్ఠానదేవత; అగు = అయిన; సోముండును = సోముడు; గగన = ఆకాశమునకు; అధిష్ఠానదేవత = అధికారి; ఛత్రంబును = గొడుగు; కమండలువున్ = కమండలమును; బ్రహ్మయున్ = బ్రహ్మదేవుడు; సరస్వతి = సరస్వతీదేవి; అక్షమాలిక = జపమాల; సప్తర్షులు = సప్తర్షులు; కుశపవిత్రంబులు = పవిత్రమైనదర్భలు; ఇచ్చిరి = ఇచ్చిరి; మఱియున్ = ఇంకను.

భావము:
“ఈ ఇల్లాలికి లక్ష్మి పార్వతులే సమానమైన వారు. ఇతరులు సమానులు కాదు.” అంటూ పెద్ద ముత్తైదువలు బాలెంతరాలైన అదితికి పది రోజులు పురుడు నడిపినారు.
                    అటు పిమ్మట, వామనుడికి వడుగు చేయడం కోసం కశ్యప ప్రజాపతిని ముందుంచుకొని మునీంద్రులు తగిన సకల ఉపనయన కార్యకలాపాలు జరిపించారు. వామనుడికి సూర్యుడు గాయత్రి మంత్రాన్ని బోధించాడు. బృహస్పతి జంధ్యాన్నీ; కశ్యపుడు ముంజ, దర్భల మొలత్రాడునూ; అదితి కౌపీనాన్నీ; భూదేవి నల్లని జింకచర్మాన్నీ; చంద్రుడు దండాన్నీ; ఆకాశం గొడుగునూ; బ్రహ్మ కమండలాన్ని; సరస్వతీదేవి జపమాలనూ; సప్తఋషులు పవిత్రమైన దర్భలనూ ఇచ్చారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=69&Padyam=516

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Monday, November 21, 2016

వామన వైభవం - 31:

8-514-క.
"నన్నుఁ గన్న తండ్రి! నా పాలి దైవమ! 
నా తపఃఫలంబ! నా కుమార! 
నాదు చిన్ని వడుగ! నా కులదీపిక! 
రాఁగదయ్య; భాగ్య రాశి వగుచు
8-515-క.
అన్నా! ర" మ్మని డగ్గఱి
చన్నుల పాలేఱువాఱ సంశ్లేషిణి యై
చిన్నారి మొగము నివురుచుఁ
గన్నారం జూచెఁ గన్నకడుపై యుంటన్


టీకా:
నన్నున్ = నన్ను; కన్నతండ్రి = కన్నతండ్రి; నా = నా; పాలి = పాలిటి; దైవమా = దేవుడా; నా = నా యొక్క; తపః = తపస్సుయొక్క; ఫలంబ = ఫలితముగకలిగినవాడ; నా = నా యొక్క; కుమార = పుత్రుడ; నాదు = నా యొక్క; చిన్ని = చిన్న; వడుగ = బాలుడ; నా = నా యొక్క; కుల = వంశమును; దీపిక = ప్రకాశింపజేయువాడ; రాగదు = రమ్ము; అయ్య = తండ్రి; భాగ్యరాశివి = పెన్నిధివి; అగుచున్ = అగుచు.
                            అన్నా = అబ్బాయి; రమ్ము = రా; అని = అని; డగ్గఱి = దగ్గరకుతీసుకొని; చన్నులన్ = స్తనములందు; పాలు = పాలు; ఏఱువాఱ = జాలువారగా; సంశ్లేషిణి = కౌగలించుకొన్నది; ఐ = అయ్యి; చిన్నారి = బుల్లి; మొగమున్ = ముఖమును; నివురుచున్ = దువ్వుచు; కన్నారన్ = కంటినిండుగా; చూచెన్ = చూసెను; కన్నకడుపు = తనకడుపునపుట్టినవాడు; ఐ = అయ్యి; ఉంటన్ = ఉండుటచేత.

భావము:
కన్నబిడ్డ యైన వామనుని “నా కన్నతండ్రీ! నా పాలి దేవుడా! నా నోములపంటా! నా ముద్దుల కన్నా! నాచిన్నవడుగా! నా వంశాలంకారమా! నా పెన్నిధీ!... నా కన్నా! రావయ్యా” అంటూ అదితి దగ్గరకు పిలిచింది, అక్కున చేర్చుకుంది, మొహాన్ని దువ్వింది. తను కడుపారా కన్న ఆ చిన్నారి బాలుని కన్నుల నిండుగా చూచింది.


: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Sunday, November 20, 2016

వామన వైభవం - 30:

8-512-ఆ.
"ఈ మహానుభావుఁ డెట్లింత కాలంబు
నుదర మందు నిలిచి యుండె" ననుచు
నదితి వెఱఁగుపడియె నానంద జయశబ్ద
ములను గశ్యపుండు మొగి నుతించె.
8-513-వ.
అంత నవ్విభుండు సాయుధసాలంకారంబగు తన దివ్యరూపంబు నుజ్జగించి రూపాంతరం బంగీకరించి కపటవటు చందంబున నుపనయనవయస్కుండైన వామన బాలకుండై తల్లి ముంగటఁ గుమార సముచితాలాపంబు లాడుఁచు గ్రీడించు సమయంబున నదితియుం దనయ విలోకన పరిణామ పారవశ్యంబున.

టీకా:
ఈ = ఈ యొక్క; మహానుభావుడు = గొప్పవాడు; ఎట్లు = ఎలా; ఇంత = ఇన్ని; కాలంబు = రోజులు; ఉదరము = గర్భము; అందున్ = లో; నిలిచి = స్థిరముగ; ఉండెన్ = ఉన్నాడు; అనుచున్ = అనుచు; అదితి = అదితి; వెఱగు = ఆశ్చర్య; పడియెన్ = పోయెను; ఆనంద = సంతోషపు; ఆనంద = ఆనందపు; జయశబ్దములనున్ = జయజయధ్వానములను; కశ్యపుండు = కశ్యపుడు; మొగిన్ = పూని; నుతించెన్ = స్తుతించెను. అంతన్ = అంతట; ఆ = ఆ; విభుండు = భగవంతుడు; సాయుధ = ఆయుధములు గల; సాలంకారంబు = అలంకారములు గలది; అగు = అయిన; తన = తన యొక్క; దివ్య = దివ్యమైన; రూపంబున్ = స్వరూపమును; ఉజ్జగించి = ఉపసంహరించి; రూప = స్వరూపము నందు; అంతరంబున్ = మార్పును; అంగీకరించి = స్వీకరించి; కపట = మాయా; వటు = బ్రహ్మచారి; చందంబునన్ = వలె; ఉపనయన = వడుగుచేయదగిన; వయస్కుండు = వయసుగలవానిగ; ఐన = అయినట్టి; వామన = పొట్టి; బాలకుండు = చిన్నబాలుడు; ఐ = అయ్యి; తల్లి = అమ్మకు; ముంగటన్ = ఎదురుగ; కుమార = పుత్రునికి; సముచిత = తగిన; ఆలాపంబులు = పలుకులు; ఆడుచున్ = పలుకుచు; క్రీడించు = విహరించెడి; సమయంబునన్ = సమయమునందు; అదితియున్ = అదితి; తనయ = పుత్రుని; విలోకన = చూచుటవలన; పరిణామ = కలిగిన; పారవశ్యంబునన్ = మైమరపుతో.


భావము:
“ఇంతటి మహానుభావుడు ఇంతకాలమూ నా కడుపులో ఎలా ఉన్నాడా” అని వామనుడిని చూసి అదితి ఆశ్చర్యపడింది. ఆనందంతో కూడిన జయజయ శబ్దాలతో కశ్యపుడు స్వామిని పూని సంస్తుతించాడు.
అటుపిమ్మట వామనుడు ఆయధాలూ అలంకారాలు కలిగిన తన దివ్య రూపాన్ని వదిలిపెట్టి, కపట బ్రహ్మచారిగా మారురూపాన్ని పొందాడు. పొట్టి బాలుడుగా, వడుగు చేయదగిన వయస్సు కలవాడుగా అయ్యాడు. ఆ కొడుకుని చూచి అదితి ఆనందంతో మైమరచి, పారవశ్యమున. . .

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=69&Padyam=512

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Saturday, November 19, 2016

వామన వైభవం - 29:

8-510-క.
ముంపుఁగొని విరుల వానల
జొంపంబులు గురియు సురలు, సమనోమధువుల్
తుంపర లెగయఁ బరాగపు
రొంపుల భూభాగమతి నిరూషిత మయ్యెన్.
8-511-వ.
తదనంతరంబ

టీకా:
ముంపుగొని = గుంపులుగూడి; విరుల = పూల; వానలన్ = వానల; జొంపంబులన్ = నిరంతరధారలు; కురియు = వర్షించెను; సురలు = దేవతలు; సుమనస్ = పూల; మధువుల్ = మకరందము; తుంపరలు = బిందువులు; ఎగయన్ = ఎగురుతుండగ; పరాగపు = పుప్పొటి; రొంపులన్ = గుట్టలతో, బురదలతో; భూభాగము = భూమండలము; అతి = మిక్కలి; నిరూషితము = నిండిపోయినది; అయ్యెన్ = అయినది. తత్ = ఆ; అనంతరంబ = తరువాత.



భావము:
పొదరిండ్లు విశేషంగా పూలజల్లులు విరజల్లాయి. దేవతలు కురిపించిన పూలవానల మకరంద బిందువులు అంతటా వ్యాపించాయి. పుప్పొడుల కుప్పలతో భూభాగం నిండిపోయింది. అలా వామనుడు అవతరించిన పిమ్మట. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=69&Padyam=510

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Friday, November 18, 2016

వామన వైభవం - 28:

8-508-శా.
చింతం బాసిరి యక్ష తార్క్ష్య సుమనస్సిద్ధోరగాధీశ్వరుల్
సంతోషించిరి సాధ్య చారణ మునీశబ్రహ్మ విద్యాధరుల్
గాంతిం జెందిరి భానుచంద్రములు; రంగద్గీత వాద్యంబులన్
గంతుల్ వైచిరి మింటఁ గింపురుషులున్ గంధర్వులుం గిన్నరుల్.
8-509-క.
దిక్కులకావిరి వాసెను
నెక్కువ నిర్మలత నొందె నేఁడు పయోధుల్
నిక్కమెయి నిలిచె ధరణియుఁ
జుక్కల త్రోవయును విప్రసుర సేవ్యములై.



టీకా:
చింతన్ = శోకములను; పాసిరి = విడిచితిరి; యక్ష = యక్షులు; తార్క్ష్య = గరుడులు; సుమన = దేవతలు; సిద్ధ = సిద్ధులు; ఉరగ = నాగులు; అధీశ్వరులు = ప్రభువులు; సంతోషించిరి = సంతోషించిరి; సాధ్య = సాధ్యులు; చారణ = చారణులు; మునీశ = మునీశ్వరులు; బ్రహ్మ = ఋత్విజులు; విద్యాధరుల్ = విద్యాధరులు; కాంతిన్ = వికాశమును; చెందిరి = పొందిరి; భాను = సూర్యుడు; చంద్రములు = చంద్రుడు; రంగత్ = ఆనందపు; గీత = గీతములతోను; వాద్యంబులన్ = వాద్యములతోను; గంతుల్ = నాట్యములు; వైచిరి = చేసిరి; మింటన్ = ఆకాశమునందు; కింపురుషులున్ = కింపురుషులు; గంధర్వులున్ = గంధర్వులు; కిన్నరుల్ = కిన్నరలు. దిక్కుల = దిక్కులందలి; కావిరి = నలుపు, మాపు; పాసెను = పోయెను; ఎక్కువ = చాలా; నిర్మలతన్ = నిర్మలముగనుండుటను; ఒందె = పొందినవి; నేడు = ఇప్పుడు; పయోధుల్ = సముద్రములు; నిక్కమెయి = నిచ్చలముగా; నిలిచె = అలరారెను; ధరణియున్ = భూమండలము; చుక్కలత్రోవయును = ఆకాశము {చుక్కలత్రోవ - చుక్కలు (నక్షత్రములు) త్రోవ (తిరుగు స్థలము), ఆకాశము}; విప్ర = బ్రాహ్మణలు; సుర = దేవతలు చేత; సేవ్యములు = కొలువబడినవి; ఐ = అయ్యి.

భావము:
వామనుడు పుట్టటంతో యక్షులూ, గరుడులూ, దేవతలూ, సిద్ధులూ, నాగులూ తమ చింతలు అన్నీ విడిచిపెట్టారు. సాధ్యులూ, చారణులూ, ఋషులూ, ఋత్విజులూ, విద్యాధరులూ సంతోషించారు. సూర్య చంద్రులు మిక్కిలి ప్రకాశవంతులు అయ్యి కాంతులు విరజిమ్మారు. గంధర్వులూ, కిన్నరులూ, కింపురుషులూ వాద్యాలు మ్రోగిస్తూ ఆటపాటలతో ఆకాశంలో నాట్యాలు చేశారు. సకల దిక్కు లు అందలి కావిరంగు కరగిపోయింది; సప్తసముద్రాలు నిర్మలం అయ్యాయి; భూమి పొంగి పులకరించింది; బ్రాహ్మణులతో దేవతలతో ఆకాశం అలరారింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=69&Padyam=509

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Thursday, November 17, 2016

వామన వైభవం - 27:

8-507-వ.
మఱియు నద్దేవుండు శంఖచక్రగదా కమల కలిత చతుర్భుజుండునుఁ బిశంగవర్ణవస్త్రుండును. మకరకుండల మండిత గండభాగుండును, శ్రీవత్సవక్షుండును, నళినచక్షుండును, నిరంతర శ్రీవిరాజిత రోలంబ కదంబాలంబిత వనమాలికా పరిష్కృతుండును, మణికనకాంచిత కాంచీవలయాంగద కిరీటహార నూపురాలంకృతుండునుఁ, గమనీయ కంఠ కౌస్తుభాభరణుండును, నిఖిలజన మనోహరణుండునునై యవతరించిన సమయంబున.

టీకా:
మఱియున్ = ఇంకను; శంఖ = శంఖము; చక్ర = చక్రము; గదా = గద; కమల = పద్మము; కలిత = ధరించిన; చతుర్ = నాలుగు (4); భుజుండునున్ = చేతులుగలవాడు; పిశంగ = గోరోజన; వర్ణ = రంగుగల; వస్త్రుండును = బట్టలుధరించినవాడు; మకరకుండల = మకర కుండలములచే {మకరకుండలములు - కర్ణాభరణ విశేషములు}; మండిత = మెరిసెడి; గండభాగుండును = చెక్కిళ్ళుగలవాడు; శ్రీవత్స = శ్రీవత్సము యనెడి మచ్చ; వక్షుండును = వక్షస్థలమున కలవాడు; నళిన = పద్మముల వంటి; చక్షుండును = కన్నులు కలవాడు; నిరంతర = ఎల్లప్పుడును; శ్రీ = సౌభాగ్యముతో; విరాజిత = విరాజిల్లెడి; రోలంబ = తుమ్మెదల; కదంబ = సమూహములు; ఆలంబిత = మూగెడి; వనమాలికా = వనమాలచే {వనమాల - పువ్వులు ఆకులు కలిపికట్టిన దండ}; పరిష్కృతుండును = అలంకరింపబడినవాడు; మణి = రత్నములు; కనకా = బంగారములు; అంచిత = పొదగబడిన; కాంచీ = మొలనూలు; వలయ = కడియాలు; అంగద = బాహుపురులు; కిరీట = కిరీటము; హార = హారములు; నూపురా = కాలిఅందెలుచే; అలంకృతుండును = అలంకరింపబడినవాడు; కమనీయ = అందమైన; కంఠ = మెడలో; కౌస్తుభ = కౌస్తుభమణి; ఆభరణుండును = ఆభరణముగా గలవాడు; నిఖిల = సమస్తమైన; జన = వారి; మనస్ = మనసులను; హరణుండును = ఆకర్షించువాడు; ఐ = అయ్యి; అవతరించిన = పుట్టిన; సమయంబున = సమయమునందు.

భావము:
వామనుడు జన్మించినప్పుడు అతనికి నాలుగు చేతులు ఆ చేతులలో శంఖమూ, చక్రమూ, గదా, పద్మమూ; గోరోజనం రంగు వస్రమూ, మకరకుండలాలతో మెరిసే చెక్కిళ్ళు; రొమ్ముపై శ్రీవత్సమూ కమలాల వంటి కన్నులు కలిగి ఉన్నాడు. తుమ్మెదలు మూగిన అందమైన వనమాల (వైజయంతి మాల) మెడలో కదులుతున్నది. రత్నాలు కూర్చిన బంగారు వడ్డాణం బాహుపురులూ, కిరీటమూ, హారాలూ, కాలిఅందెలూ, కాంతులు వెదజల్లుతున్నాయి. కమనీయమైన కంఠభాగాన కౌస్తుభమణి మెరుస్తున్నది. అతని రూపం అఖిల జనుల మనస్సులను అకర్షిస్తున్నది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=69&Padyam=507

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం

Wednesday, November 16, 2016

వామన వైభవం - 26:

8-506-మ.
రవి మధ్యాహ్నమునం జరింప గ్రహతారాచంద్రభద్రస్థితిన్
శ్రవణద్వాదశినాఁడు శ్రోణ నభిజిత్సంజ్ఞాత లగ్నంబునన్
భువనాధీశుఁడు పుట్టె వామనగతిం బుణ్యవ్రతోపేతకున్
దివిజాధీశ్వరు మాతకుం బరమపాతివ్రత్య విఖ్యాతకున్.

టీకా:
రవి = సూర్యుడు; మధ్యాహ్నము = ఆకాశమునట్టనడుమ; అందున్ = లో; చరింపన్ = తిరుగుచుండగ; గ్రహ = గ్రహములు; తార = నక్షత్రములు; చంద్ర = చంద్రుడు; భద్ర = ఉచ్చ; స్థితిన్ = దశలోనుండగ; శ్రవణ = శ్రావణమాసము; ద్వాదశి = ద్వాదశతిథి; నాడు = దినమున; శ్రోణ = శ్రవణనక్షత్రయుక్తమైన; అభిజిత్ = అభిజిత్తు {అభిజిత్తు - మిట్టమధ్యాహ్నము 24 నిమిషముల ముందునుండి 24 నిమిషములవరకు గల కాలము, దినమునందు 8వ ముహూర్తము, అభిజిత్ లగ్నము లేదా ముహూర్తము}; సంజ్ఞాత = అనెడిపేరుగల; లగ్నంబునన్ = లగ్నమునందు; భువనాధీశుడు = విష్ణువు {భువనాధీశుడు - భువన (జగత్తునకు) అధీశుడు (ప్రభువు), విష్ణువు}; పుట్టెన్ = జన్మించెను; వామన = పొట్టివాని; గతిన్ = వలె; పుణ్య = పుణ్యవంతమైన; వ్రత = వ్రతనిష్టలు; ఉపేత = కలిగియున్నామె; కున్ = కు; దివిజాధీశ్వరుమాత = అదితి {దివిజాధీశ్వరుమాత - దివిజాధీశ్వరుని (ఇంద్రుని) మాత, అదితి}; పరమ = అత్యుత్తమమైన; పాతివ్రత్య = పతివ్రతగా; విఖ్యాత = ప్రసిద్ధిపొందినామె; కున్ = కు.

భావము:
అలా బ్రహ్మదేవుడు స్తోత్రం చేసిన పిమ్మట, నిర్మలమైన నియమంతో గొప్ప పతివ్రతగా పేరు పొందిన దేవేంద్రుని తల్లి అయిన అదితి గర్భం నుండి వామన రూపంతో సకల లోకాధీశుడు అయిన మహావిష్ణువు జన్మించాడు. అది శ్రావణమాసం ద్వాదశి శ్రవణ నక్షత్రం అభిజిత్తు అనబడే లగ్నం పట్టపగలు సూర్యుడు ఆకాశం నట్టనడుమ ప్రకాశిస్తున్నాడు. గ్రహాలూ నక్షత్రాలూ చంద్రుడూ ఉచ్ఛదశలో ఉన్నాయి. 
(పంచాంగాదులలో భాద్రపద మాసం శుద్ధ ద్వాదశి నాడు వామన జయంతి అని వాడుక ఉంది)

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=69&Padyam=506

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Tuesday, November 15, 2016

వామన వైభవం - 25:



8-504-క.
విచ్చేయు మదితి గర్భము
చెచ్చెర వెలువడి మహాత్మ! చిరకాలంబున్
విచ్చలవిడి లే కమరులు
ముచ్చటపడి యున్నవారు ముద మందింపన్. "
8-505-వ.
అని యిట్లు కమలసంభవుండు వినుతిచేయు నయ్యవసరంబున.

టీకా:
విచ్చేయుము = రమ్ము; అదితి = అదితి యొక్క; గర్బమున్ = కడుపులో నుండి; చెచ్చెరన్ = శ్రీఘ్రమే; వెలువడి = బయటకొచ్చి; మహాత్మా = గొప్పవాడ; చిరకాలంబున్ = చాలాకాలమునుండి; విచ్చలవిడిన్ = స్వేచ్ఛ; లేక = లేకపోవుట చేత; అమరులు = దేవతలు; ముచ్చటపడి = కోరుతు; ఉన్నవారు = ఉన్నారు; ముదము = సంతోషమును; అందింపన్ = సమకూర్చుటానికై. అని = అని; ఇట్లు = ఈ విధముగ; కమలసంభవుండు = బ్రహ్మదేవుడు {కమలసంభవుడు - కమలమునందు సంభవుడు (పుట్టినవాడు), బ్రహ్మ}; వినుతి = స్తోత్రములు; చేయన్ = చేయగా; ఆ = ఆ; అవసరంబునన్ = సమయమునందు.

భావము:
మహానుభావా! చాలాకాలంగా దేవతలు స్వేచ్ఛకోసం ఆరాటపడుతున్నారు. వారికి సంతోషాన్ని సమకూర్చడానికై తొందరగా అదితి గర్భం నుండి వెలువడి వేంచేయవయ్యా." కమలంలో పుట్టిన బ్రహ్మదేవుడు ఈ విధంగా స్తుతిస్తూ ఉన్న ఆ సమయములో. . .

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=68&Padyam=504

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Monday, November 14, 2016

వామన వైభవం - 24:

8-502-వ.
తదనంతరంబునం జతురాననుం డరుగుదెంచి యదితిగర్భపరిభ్రమ విభ్రముం డగు నప్పరమేశ్వరు నుద్దేశించి యిట్లని స్తుతియించె.
8-503-సీ.
త్రిభువన జయరూఢ! దేవ! త్రివిక్రమ! ;
పృథులాత్మ! శిపివిష్ట! పృశ్నిగర్భ;
ప్రీత త్రినాభ! త్రిపృష్ఠ! జగంబుల;
కాద్యంత మధ్యంబు లరయ నీవ;
జంగమ స్థావర జననాది హేతువు;
నీవ; కాలంబవై నిఖిల మాత్మ
లోపల ధరియింతు లోని జంతుల నెల్ల;
స్రోతంబులోఁ గొను చొప్పు దోఁప;
8-503.1-తే.
బ్రహ్మలకు నెల్ల సంభవ భవన మీవ;
దివమునకుఁ బాసి దుర్దశ దిక్కులేక
శోకవార్ధి మునింగిన సురలకెల్లఁ
దేల నాధార మగుచున్న తెప్ప నీవ.

టీకా:
తదనంతరంబునన్ = ఆ తరువాత; చతురాననుండు = బ్రహ్మదేవుడు {చతురాననుడు - చతుర (నాలుగు) ఆననుడు (ముఖములవాడు), బ్రహ్మ}; అరుగుదెంచి = వచ్చి; అదితి = అదితి; గర్భ = గర్భమునందు; పరిభ్రమ = తిరుగుచు; విభ్రముండు = విలాసముగనున్నవాడు; అగు = అయిన; ఆ = ఆ; పరమేశ్వరున్ = భగవంతుని; ఉద్దేశించి = ఉద్దేశించి; ఇట్లు = ఈ విధముగ; అని = అని; స్తుతియించె = కీర్తించెను. త్రిభువనజయరూఢ = విష్ణువు {త్రిభువనజయరూఢుడు - త్రిభువన (ముల్లోకములను) జయ (జయించుట) రూఢుడు (నిశ్చయముగాగలవాడు), విష్ణువు}; దేవ = విష్ణువు {దేవ - భగవంతుడు, విష్ణువు}; త్రివిక్రమ = విష్ణువు {త్రివిక్రమ - ముల్లోకములను ఆక్రమించినవాడు, విష్ణువు}; పృథులాత్మ = విష్ణువు {పృథులాత్ముడు - పృథుల (మహా) ఆత్ముడు, విష్ణువు}; శిపివిష్ట = విష్ణువు {శిపివిష్టః - కిరణముల స్వరూపమున అంతటను వ్యాపించి యున్నవాడు, యజ్ఞపశువునందు వ్యాపించి యున్నవాడు, విష్ణువు (తెవికె)}; పృశ్నిగర్భ = విష్ణువు {పృశ్నిగర్భ - పృశ్ని (కిరణములకు) గర్భ (జన్మస్థానమైనవాడు) (మిక్కిలిగ ప్రకాశించువాడు), పృశ్ని (అదితి పూర్వజన్మ నామము) గర్భముననున్న వాడు, విష్ణువు}; ప్రీత = విష్ణువు {ప్రీత - సర్వులకు ప్రీతి యైనవాడు, విష్ణువు}; త్రినాభ = విష్ణువు {త్రినాభ - మూడు (లోకములు) నాభి యందు కలవాడు, విష్ణువు}; త్రిపృష్ఠ = విష్ణువు {త్రిపృష్ట - త్రి (మూడు -అడుగులు) పృష్ట (అడుగబడినవి కలవాడ), వామనుడు, విష్ణువు}; జగంబుల = లోకములకు; ఆది = మొదలు; అంత = చివర; మధ్యంబులు = మధ్యభాగములు; అరయన్ = తరచిచూసిన; నీవ = నీవే; జంగమ = చర; స్థావర = అచరములకు; జనన = పుట్టుకలకు; ఆది = ముఖ్య; హేతువు = కారణభూతుడవు; నీవ = నీవే; కాలంబవు = కాలస్వరూపుడవు; ఐ = అయ్యి; నిఖిల = సమస్తమైన; ఆత్మన్ = జీవకోటిని; లోపలన్ = నీ యందే; ధరియింతు = ధరించెదవు; లోని = లోపలయున్న; జంతులన్ = ప్రాణులను; ఎల్లన్ = అన్నిటిని; స్రోతంబు = ప్రవాహము; లోన్ = లోనికి; కొను = తీసుకొనెడి; చొప్పు = విధముగ; తోపన్ = అనిపించునట్లు.
బ్రహ్మల = సృష్టికర్తల; కున్ = కు; ఎల్లన్ = అందరకు; సంభవ = పుట్టుకలకు; భవనము = స్థానము; ఈవ = నీవే; దివమున్ = స్వర్గమునకు; పాసి = దూరమై; దుర్దశన్ = కష్టములలో; దిక్కు = శరణమిచ్చువారు; లేక = లేకపోవుటచేత; శోక = శోకము యనెడి; వార్ధిన్ = సముద్రమున; మునింగిన = ములిగిపోయిన; సురల = దేవతల; కున్ = కు; ఎల్లన్ = అందరకు; తేలన్ = బయటపడుటకు; ఆధారము = ఆధారభూతము; అగుచున్న = అగుచున్న; తెప్ప = నావ; నీవ = నీవే.

భావము:
ఆ సమయంలో బ్రహ్మదేవుడు వచ్చి, అదితి గర్భంలో అందంగా కలియ తిరుగుతూ కదలాడుతున్న భగవంతుని ఉద్దేశించి ఈ విధంగా స్తోత్రం చేసాడు. “అదితి గర్భంలో వర్ధిల్లుతున్న ఓ స్వామీ! నీవు ముల్లోకాలనూ జయింపగల వాడవు: దేవాధిదేవుడవు: ముల్లోకములనూ ఆక్రమించు వాడవు: మహాత్ముడవు: కిరణముల రూపమున సర్వస్వమునందు వ్యాపించి ఉండువాడవు: కిరణములకు మూలము అయి వాడవు: పృశ్ని అను నామాంతరం గల అదితి గర్భంలో ఉన్నవాడవు: సర్వులకు ఇష్టుడవైన విష్ణువు నీవు: సమస్త భువనాలనూ సంతోషంగా నీ కడుపులో దాచుకుంటావు: ఈలోకాలకు మొదలూ నడుమ తుదా నీవే: చరాచర ప్రపంచం పుట్టడానికి కారణం నీవే: కాలమై సమస్తమూ నీ లోపలే ధరిస్తావు: ప్రవాహం ప్రాణికోటిని ధరించినట్లు సమస్త జీవులనూ నీలోనే నిలుపు కొంటావు: సృష్టికర్తలకు సృష్టికర్తవు నీవు: స్వర్గ లోకాన్ని పోగొట్టుకొని దేవతలు కష్టసముద్రంలో మునిగారు. వారిని కాపాడి గట్టు చేర్చే తెప్పవు నీవు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=68&Padyam=503

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Sunday, November 13, 2016

వామన వైభవం - 23:

8-499-క.
పెట్టుదురు నుదుట భూతిని
బొట్టిడుదురు మేఁన బట్టుఁ బుట్టపుదోయిం
బెట్టుదురు వేల్పు లమ్మకుఁ
గట్టుదురు సురక్ష పడఁతిగర్భంబునకున్.
8-500-వ.
ఇవ్విధంబున
8-501-తే.
విశ్వగర్భుఁడు దన గర్భ వివరమందు
బూటపూటకుఁ బూర్ణుఁడై పొటకరింప
వ్రేఁక జూలాలితనమున వేల్పుఁ బెద్ద
పొలఁతి కంతట నీళ్ళాడు ప్రొద్దులయ్యె

టీకా:
పెట్టుదురు = పెట్టెదరు; నుదుటన్ = నుదుటిమీద; భూతిని = విభూతిని; బొట్టిడుదురు = బొట్టుగాపెట్టెదరు; మేనన్ = ఒంటిమీదకి; పట్టు = పట్టు; పుట్టపు = బట్టల; దోయిన్ = జత (2)ని; పెట్టుదురు = పెట్టెదరు; వేల్పులమ్మ = అదితి; కున్ = కి; కట్టుదురు = కట్టెదరు; సురక్ష = రక్షాతోరమును; పడతి = సతియొక్క; గర్భంబున్ = గర్భమున; కున్ = కు. ఈ = ఈ; విధంబునన్ = విధముగ.
విశ్వగర్భుడు = నారాయణుడు {విశ్వగర్భుడు - విశ్వము గర్భమున కలవాడు, విష్ణువు}; తన = తన యొక్క; గర్భవివరము = గర్భాశయము; అందున్ = లో; పూటపూట = రోజురోజు; కున్ = కి; పూర్ణుడు = నిండుతున్నవాడు; ఐ = అయ్యి; పొటకరింపన్ = వర్థిల్లుచుండగా; వ్రేకన్ = భారమైన; చూలాలితనమునన్ = నిండుచూలాలిగ; వేల్పుపెద్దపొలతి = అదితి; కిన్ = కి; అంతట = అప్పుడు; నీళ్ళాడు = ప్రసవించెడి, పురిటి; ప్రొద్దులు = సమయము; అయ్యె = అయినది.

భావము:
పెద్దముత్తైదువలు దేవతలకు తల్లి అయిన అదితికి నుదుట విభూతి పెట్టారు. తిలకం దిద్దారు పట్టుబట్టలు కట్టారు. ఆమె గర్భానికి రక్ష కట్టారు. ఈ విధంగా హరి గర్భస్తుడు అయి.... 
             అదితి గర్భంలో విశ్వగర్భుడైన భగవంతుడు పూర్ణుడు అవుతూ పూటపూటకూ పెరిగసాగాడు. గర్భం బరువెక్కసాగింది. దేవతల కన్నతల్లి అదితి నీళ్ళాడే సమయం ఆసన్నమయింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=67&Padyam=499

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :



Saturday, November 12, 2016

వామన వైభవం - 22:

8-497-వ.
అంత న క్కాంతాతిలకంబు క్రమక్రమంబున.
8-498-మ.
నిలిపెన్ ఱెప్పల బృందిమన్, విశదిమన్ నేత్రంబులం, జూచుకం
బుల నాకాళిమ, మేఖలం ద్రఢిమ, నెమ్మోమారఁగాఁ బాండిమన్
బలిమిం జన్నుల, శ్రోణిపాళిగరిమన్, మధ్యంబునన్ బృంహిమ
న్లలితాత్మన్ లఘిమన్, మహామహిమ మేనన్గర్భదుర్వారమై.

టీకా:
అంతన్ = ఆ సమయమున; ఆ = ఆ; కాంతా = స్త్రీలలో; తిలకంబు = శ్రేష్ఠురాలు; క్రమక్రమంబున్ = క్రమముగా.
                నిలిపెన్ = స్థిరపరచెను; ఱెప్పల = కనురెప్పల; బృందిమన్ = మనోజ్ఞతను; విశదిమన్ = పెద్దవిగా ఉండుటయందు; నేత్రంబులన్ = కన్నులను; చూచుకంబులన్ = చనుమొనలను; అకాళిమన్ = నల్లదనమును; మేఖలన్ = ఒడ్డాణము; ద్రఢిమన్ = బిగువుకావడమును; నెఱ = నిండు; మోము = ముఖము; ఆరగాన్ = ఒప్పుగా; పాండిమన్ = తెల్లదనమును; బలిమిన్ = బలిష్ఠము; చన్నులన్ = స్తనములందు; శ్రోణి = పిరుదుల; పాళి = ప్రదేశము; గరిమన్ = గొప్పదనమును; మధ్యంబునన్ = నడుమునందు; బృంహిమ = లావగుట; లలిత = మనోజ్ఞమైన; ఆత్మన్ = మనసునందు; లఘిమన్ = తేలికపడుట; మహా = మిక్కిలి; మహిమ = మహత్వము; మేనన్ = దేహమునందు; గర్భ = గర్భము; దుర్వారము = ఆపలేనిది; ఐ = అయ్యి.

భావము:
అదితి క్రమక్రమంగా నిండుచూలాలు అయింది. . . ఆమె రెప్పలు అందంగా ఒప్పాయి: కన్నులు నిర్మలమయ్యాయి: స్తనాగ్రాలు నల్లపడ్డాయి: ఒడ్డాణం బిగువైంది; ముఖం తెల్లబడింది: పిరుదులు బరువెక్కాయి: నడుము విస్తరించింది: మనస్సు తేలికపడింది. దేహం మహత్వాన్ని పొందింది. గ్రర్భం అతిశయించింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=67&Padyam=498

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Friday, November 11, 2016

వామన వైభవం - 21:

8-495-క.
మహితతర మేఘమాలా
పిహితాయుత చండభాను బింబప్రభతో
విహితాంగంబులఁ గశ్యపు
గృహిణీగర్భమున శిశువుఁ గ్రీడించె నృపా!
8-496-క.
తన కడుపున నొక యిరువునఁ
వనరుహగర్భాండభాండ వనధిచయంబుల్
గొనకొని జగములు నిడుకొని
తనుగతిఁ గడు నడఁగి మడిఁగి తనరెన్ బెడఁగై.

టీకా:
మహితతర = మిక్కిలిగొప్పదైన; మేఘ = మబ్బుల; మాలా = గుంపులచే; పిహిత = కప్పివేయబడిన; అయుత = పదివేల; చండభాను = సూర్య; బింబ = బింబముల; ప్రభ = ప్రకాశము; తోన్ = తో; విహిత = చక్కటి; అంగంబులన్ = అవయవములతో; కశ్యపు = కశ్యపుని; గృహిణీ = ఇల్లాలు యొక్క; గర్భమునన్ = కడుపులో; శిశువు = శిశువు; క్రీడించెన్ = కదలాడసాగెను; నృపా = రాజా {నృపుడు - నరులను పాలించువాడు, రాజు}.
           తన = తన యొక్క; కడుపునన్ = గర్భమునందు; ఒక = ఒక; ఇరువున = పక్కన; వనరుహగర్భాండభాండ = బ్రహ్మాండముల {వనరుహగర్భాండభాండము - వనరుహగర్భ (బ్రహ్మ) అండముల భాండములు (గుంపులు), బ్రహ్మాండ భాండములు}; వనధి = సముద్రముల {వనధి - వనము (నీటి)కి నిధి, సముద్రము}; చయంబుల్ = సమూహములు; కొనకొని = కూడుకొనిన; జగములున్ = భువనములను; ఇడుకొని = ఉంచుకొని; తను = సన్ననిఅర్భకుని; గతిన్ = వలె; అడగి = అణిగి; మడిగి = మణిగి; తనరెన్ = చక్కగనుండెను; బెడగు = అందగించినవాడు; ఐ = అయ్యి.

భావము:
పరీక్షిన్మహారాజా! అదితి గర్భంలో అవయవాలతోకూడిన ఆ అద్భుత శిశువు గొప్ప మేఘాలు కప్పిన సూర్యబింబాల వెలుగుతో కదలాడసాగాడు.
అదితి గర్భంలోని చిన్నారి శిశువు భూగోళాలనూ ఖగోళాలను సముద్రాలను సమస్తలోకాలనూ తన కడుపులో ఇమిడించికొని సన్ననైన చిన్ని రూపంతో అందంగా అణగిమణిగి ఉన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=67&Padyam=495

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Thursday, November 10, 2016

వామన వైభవం - 20:

8-493-క.
చలచలనై పిదపిదనై
గలలంబై కరుడు గట్టి గళనాళముతోఁ
దల యేర్పడి గర్భంబై
నెలమసలం జీరచిక్కె నెలఁతకు నధిపా!
8-494-క.
నెలతకుఁ జూలై నెల రె
న్నెలలై మఱి మూఁడు నాల్గు నెలలై వరుసన్
నెల లంతకంత కెక్కఁగ
నెలలును డగ్గఱియె నసుర నిర్మూలతకున్.

టీకా:
చలచలను = కదిలెడిద్రవమువలె; ఐ = అయ్యి; పిదపిదన్ = మెత్తమెత్తగా; ఐ = అయ్యి; కలలంబు = గర్భపిండము; ఐ = అయ్యి; కరడుగట్టి = గట్టిబడి; గళనాళము = గొంతు; తోన్ = తోబాటు; తల = శిరస్సు; ఏర్పడి = ఏర్పడి; గర్భంబు = పిండముగా; ఐ = అయ్యి; నెలమసలన్ = నెలతప్పగా; చీరజిక్కె = కడుపు వచ్చినది {చీరజిక్కు - చీర చాలలేదు, కడుపు వచ్చెను}; నెలత = యువతి; కున్ = కు; అధిపా = రాజా.
                             నెలత = సతి; కున్ = కి; చూలు = కడుపు; ఐ = వచ్చి; నెల = ఒకటవనెల (1); రెన్నెలలు = రెండునెలలు (2); ఐ = అయ్యి; మఱి = ఇంకా; మూడు = మూడు (3); నాల్గు = నాలుగు (4); నెలలు = నెలలు; ఐ = నిండి; వరుసన్ = క్రమముగా; నెలలు = నెలలు; అంతకంతకున్ = అంతకంతకు; ఎక్కగా = నిండుతుండగా; నెలలు = సమయము; డగ్గఱియెన్ = దగ్గరపడినది; అసుర = రాక్షస; నిర్మూలత = సంహారమున; కున్ = కు.

భావము:
ఒక నెల గడిచింది. అదితి కడుపులో క్రమక్రమంగా ద్రవరూపమూ మెత్తని రూపమూ గడ్డకట్టి పిండరూపము ఏర్పడింది. నెల తప్పింది గొంతుతోపాటు తల ఏర్పడి గర్భం నిలిచింది.
                        అదితి చూలాలైన తరువాత వరుసగా ఒకటి రెండు మూడు నాలుగు నెలలు గడిచాయి. క్రమంగా నెలలు పెరిగినాయి. దానితోపాటు రాక్షసులు నాశనం కావడానికి నెలలు సమీపించాయి.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=67&Padyam=493

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Wednesday, November 9, 2016

తెలుగు భాగవతం చరణి గ్రంథం

ఐ పోను, ఐఓఎస్ పరికరాలు వాడువారు తెలుగుభాగవతం చరణిగ్రంథం ఈ లింకులో తీసుకొనగలరు

వామన వైభవం - 19:

8-491-ఆ.
ఘన సమాధినుండి కశ్యపుఁ డచ్యుతు
నంశ మాత్మనొలయ నదితి యందుఁ
దనదు వీర్య మధికతరము సేర్చెను గాలి
శిఖిని దారువందుఁజేర్చినట్లు.
8-492-వ.
ఇట్లు కశ్యప చిరతర తపస్సంభృత వీర్యప్రతిష్ఠిత గర్భయై సురల తల్లి యుల్లంబున నుల్లసిల్లుచు నుండె; నంత.

టీకా:
ఘన = గొప్ప; సమాధిన్ = యోగసమాధి; నుండి = నుండి; కశ్యపుడు = కశ్యపుడు; అచ్యుతున్ = హరి యొక్క; అంశన్ = అంశను; ఆత్మన్ = తనయందు; ఒలయన్ = ప్రవేశించగా; అదితి = అదితి; అందున్ = లో; తనదు = తన యొక్క; వీర్యమున్ = రేతస్సును; అధికతరమున్ = మిక్కలి అధికమైనదిగా {అధికము - అధికతరము - అధికతమము}; చేర్చెన్ = చేర్చెను; గాలి = వాయువు; శిఖిని = అగ్నిని; దారువు = కొయ్య; అందున్ = లో; చేర్చిన = చేర్చిన; అట్లు = విధముగ.
                          ఇట్లు = ఈ విధముగ; కశ్యప = కశ్యపుని యొక్క; చిరతర = చాలా ఎక్కువ కాలము {చిరము - చిరతరము - చిరతమము}; తపస్ = చేసినతపస్సుచే; సంభృత = చక్కగాధరించిన; వీర్య = రేతస్సు; ప్రతిష్టిత = ఉంచబడిన; గర్భ = గర్భాశయము కలామె; ఐ = అయ్యి; సురలతల్లి = అదితి {సురలతల్లి - దేవతల మాత, అదితి}; ఉల్లంబునన్ = మనసునందు; ఉల్లసించుచున్ = సంతోషించుచు; ఉండెను = ఉండెను; అంత = అప్పుడు.

భావము:
తపస్సులో ఉన్న కశ్యపునిలో విష్ణువు తేజస్సు ప్రవేశించింది. వాయువు కొయ్యలో అగ్నిని చేర్చిన విధంగా అదితితో కశ్యపుడు తన అసాధారణమైన వీర్యాన్ని చేర్చాడు.


రాజా పరీక్షిత్తూ! ఈ విధంగా కశ్యపుడు చాలాకాలంగా మహతపో విశేషంతో సంపాదించిన వీర్యంవల్ల అదితి గర్భాన్ని ధరించింది. ఆమె మనసు చాలా ఉల్లాసాన్ని పొందింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=67&Padyam=491

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Tuesday, November 8, 2016

వామన వైభవం - 18:

8-489-క.
ఏలింతు దివము సురలనుఁ
బాలింతు మహేంద్రయువతి భాగ్యశ్రీలం
దూలింతు దానవుల నిర్మూలింతు రిపుప్రియాంగముల భూషణముల్. "
8-490-వ.
అని యిట్లు భక్తజనపరతంత్రుండగు పురాణపురుషుం డానతిచ్చి తిరోహితుడయ్యె; అ య్యదితియుఁ గృతకృత్య యై సంతోషంబునఁ దన మనోవల్లభుండగు కశ్యపు నాశ్రయించి సేవించుచుండె; అంత నొక్క దివసంబున.

టీకా:
ఏలింతున్ = పరిపాలింపజేసెదను; దివమున్ = స్వర్గమును; సురలనున్ = దేవతలను; పాలింతున్ = కాపాడెదను; మహేంద్ర = ఇంద్రుని {మహేంద్రుడు - మహా (గొప్ప) ఇంద్రుడు, దేవేంద్రుడు}; యువతిన్ = భార్యయొక్క; భాగ్య = సౌభాగ్యము; శ్రీలన్ = సంపదలను; తూలింతున్ = చలింపజేసెదను; దానవులన్ = రాక్షసులను; నిర్మూలింతున్ = నాశము చేసెదను; రిపు = శత్రువుల; ప్రియ = భార్యల; అంగముల = దేహమునందలి; భూషణముల్ = అలంకారములు.
                            అని = అని; ఇట్లు = ఈ విధముగ; భక్త = భక్తులైన; జన = వారికి; పరతంత్రుడు = లొంగిపోవువాడు; అగు = అయినట్టి; పురాణపురుషుండు = హరి; ఆనతిచ్చి = చెప్పి; తిరోహితుండు = మాయమైనవాడు; అయ్యెన్ = అయ్యెను; ఆ = ఆ; అదితియున్ = అదితి; కృతకృత్య = కృతార్థురాలు; ఐ = అయ్యి; సంతోషంబునన్ = సంతోషముతో; తన = తన యొక్క; మనోవల్లభుండు = భర్త; అగు = అయిన; కశ్యపున్ = కశ్యపుని; ఆశ్రయించి = చేరి; సేవించుచుండెన్ = కొలుచుచుండెను; అంతన్ = అంతట; ఒక్క = ఒక; దివసంబున = దినము.

భావము:
దేవతలు స్వర్గాన్ని పాలించేటట్లు చేస్తాను. శచీదేవి సౌభాగ్యాలను కాపాడతాను. రాక్షసులను అధికారం నుంచి తొలగించి, వారి ఇల్లాళ్ళ అలంకరాలను పోగొడతాను.”ఆ విధంగా భక్తజన విధేయుడైన విష్ణుమూర్తి సెలవిచ్చి మాయమయ్యాడు. కృతార్ధురాలైన అదితి సంతోషంతో తన ప్రాణవల్లభుడైన కశ్యపప్రజాపతిని చేరి సేవించసాగింది. అటు పిమ్మట ఒకనాడు...

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=67&Padyam=489

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :


Monday, November 7, 2016

చరణిగ్రంథం - తెలుగు భాగవతం - పత్రికా ఉవృల్లేఖన



వామన వైభవం - 17

8-489. క
నీ మణుని సేవింపుము
నా రూపము మానసించి ళినీ! గర్భా
గారంబు వచ్చి చొచ్చెద
గారామునఁ బెంపవమ్మ రుణన్ నన్నున్.

టీకా:
నీ = నీ యొక్క; రమణుని = భర్తను; సేవింపుము = కొలువుము; నా = నా యొక్క; రూపమున్ = రూపమును; మానసించి = మనసులో నిలుపుకొని; నళినీ = సుందరి; గర్భాగారంబున్ = గర్భాశయమును; వచ్చి = వచ్చి; చొచ్చెదన్ = ప్రవేశించెదను; గారమునన్ = గారముగా, ప్రేమతో; పెంపవు = పెంచుము; అమ్మ = తల్లి; కరుణన్ = దయతో; నన్నున్ = నన్ను.

భావము:
నా రూపాన్ని స్మరించుకుంటూ నీ భర్తను సేవించు నేను. నీగర్భంలో చేరుతాను మక్కువతోనూ కనికరంతోనూ నన్ను పెంచు తల్లీ!

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=66&Padyam=489



: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :


Sunday, November 6, 2016

వామన వైభవం - 16:

8-486-శా.
నీ కోడండ్రును, నీ కుమారవరులున్, నీ నాథుఁడున్, నీవు సం
శ్లోకింపన్ సతులుం బతుల్ మిగుల సమ్మోదింప రాత్రించరుల్
శోకింపన్, భవదీయ గర్భమునఁ దేజోమూర్తి జన్మించెదన్
నాకున్ వేడుక పుట్టు నీ సుతుఁడనై నర్తించి వర్తింపఁగాన్.
8-487-మ.
లిమిన్ దైత్యులఁ జంపరాదు వినయోపాయంబునం గాని; సం
నం బొందకు; నేను నీ నియతికిన్ సద్భక్తికిన్ మెచ్చితిన్;
లి విద్వేషియు నా నిలింపగణముం బౌలోమియున్ మెచ్చ దై
త్యు రాజ్యంబు హరింతు; నింద్రునికి నిత్తున్; దుఃఖమింకేటికిన్?

టీకా:
నీ = నీ యొక్క; కోడండ్రునున్ = కోడళ్ళు; నీ = నీ యొక్క; కుమార = పుత్ర; వరులున్ = రత్నములు; నీ = నీ యొక్క; నాథుడున్ = భర్త; నీవున్ = నీవు; సంశ్లోకింపన్ = స్తుతించునట్లు; సతులు = స్త్రీలు; పతులున్ = పురుషులు; మిగులన్ = ఎక్కువగా; సమ్మోదింపన్ = సంతోషించునట్లు; రాత్రించరుల్ = రాక్షసులు; శోకింపన్ = దుఃఖించగా; భవదీయ = నీ యొక్క; గర్భమునన్ = కడుపులో; తేజస్ = నా తేజస్సుకల; మూర్తిన్ = స్వరూపముతో; జన్మించెదన్ = పుట్టెదను; నా = నా; కున్ = కు; వేడుక = కుతూహలము; పుట్టున్ = కలుగుచున్నది; నీ = నీ యొక్క; సుతుడను = పుత్రుడను; ఐ = అయ్యి; నర్తించి = ఆడిపాడి; వర్తింపన్ = తిరుగవలెనని.
                            బలిమిన్ = బలముచూపి; దైత్యులన్ = రాక్షసులను; చంపన్ = సంహరించుట; రాదు = వీలుకాదు; వినయ = సహనంతోకూడిన; ఉపాయంబునన్ = ఉపాయముతో; కాని = తప్పించి; సంచలనంబున్ = కంగారు; పొందకు = పడవద్దు; నేను = నేను; నీ = నీ యొక్క; నియతి = నిష్ట; కిన్ = కు; సత్ = మంచి; భక్తి = భక్తి; కిన్ = కి; మెచ్చితిన్ = మెచ్చుకొనుచున్నాను; బలివిద్వేషియున్ = ఇంద్రుడు {బలివిద్వేషి - బలికి శత్రువు, ఇంద్రుడు}; ఆ = ఆ; నిలింప = దేవతా; గణమున్ = సమూహము; పౌలోమియున్ = శచీదేవి {పౌలోమి - పులోముని పుత్రిక, శచీదేవి}; మెచ్చ = మెచ్చుకొనునట్లు; దైత్యుల = రాక్షసుల యొక్క; రాజ్యంబున్ = రాజ్యాధికారమును; హరింతున్ = అపహరించెదను; ఇంద్రుని = ఇంద్రుని; కిన్ = కి; ఇత్తున్ = ఇచ్చెదను; దుఃఖము = శోకము; ఇంక = ఇంకా; ఏమిటికిన్ = ఎందుకు.

భావము:
“అమ్మా! తేజస్సుతో కూడిన రూపంతో నీ కడుపున జన్మిస్తాను. నీ కోడళ్ళూ, కొడుకులూ, నీ మగడూ. నీవు మెచ్చుకొనేటట్లు చేస్తాను. మీ ఆలుమగలు సంతోషించేటట్లు చేస్తాను. రాక్షసులు కళవళ పడేటట్లు చేస్తాను. నీ ఒడిలో ఆడుకోవాలని నాకు కుతూహలంగా ఉంది.
నువ్వు బాధపడకు. సహనంతోకూడిన ఉపాయంతో తప్ప బలం చూపెట్టి రాక్షసులను మట్టుపెట్టడానికి వీలు లేదు. నీ నియమానికి భక్తికి నేను సంతోషించాను. ఇంద్రుడూ, శచీదేవి, దేవతలూ సంతోషించే విధంగా రాక్షసుల రాజ్యాన్ని అపహరించి దేవతలకు ఇస్తాను. ఇంక నువ్వు దుఋఖించేపని లేదు.


: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Saturday, November 5, 2016

తెలుగు భాగవతం - 5వ తెలుగు ప్రపంచ మహాసభలు, సింగపూరు




5వ. ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు, సింగపూరులో మొదటిరోజు. .
తెలుగు భాగవత ప్రచార సమితి అంతర్జాతీయ ప్రచార వ్యవహారాల బాధ్యుడు
శ్రీ ఊలపల్లి భాస్కర కిరణ్ ప్రసంగ పరిచయం చేసాడు. ఇదే ఆ విడియో
అలాగే బెంగళూరు కర్నాటక తో సమాంతరంగా శ్రీ ఊలపల్లి ఫణి కిరణ్ ప్రచురించిన బృహత్  చరణిగ్రంథం (మొబైల్ బుక్కు) ఆవిష్కరణ కూడా సింగపూరులో చేశాడు.  

వామన వైభవం - 15:

8-484-ఆ.
అసురవరులు సురల నదలించి బెదరించి
నాక మేలుచున్న నాఁట నుండి
కన్న కడుపుఁ గాన కంటఁ గూరుకు రాదు
కడుపుఁబొక్కు మాన్పి కావవయ్య.
8-485-వ.
అనిన విని దరహసితవదనుండయి యాశ్రితకామధేనువైన యప్పరమేశ్వరుం డిట్లనియె.

టీకా:
అసుర = రాక్షస; వరులు = ఉత్తములు; సురలన్ = దేవతలను; అదలించి = హడలగొట్టి; బెదరించి = భయపెట్టి; నాకమున్ = స్వర్గమును; ఏలుచున్న = పరిపాలించుచున్న; నాటి = దినము; నుండి = నుండి; కన్న = జన్మనిచ్చిన; కడుపు = తల్లి; కాన = కావున; కంటన = కంటికి; కూరుకు = నిద్ర; రాదు = రావటములేదు; కడుపుబొక్కు = గర్భశోకము; మాన్పి = పోగొట్టి; కావవు = కావుము; అయ్య = తండ్రి.
              అనినన్ = అనగా; విని = విని; దరహసిత = చిరునవ్వుగల; వదనుండు = ముఖము కలవాడు; అయి = ఐ; ఆశ్రిత = ఆశ్రయించినవారికి; కామధేనువు = కోరినవి యిచ్చువాడు; ఐన = అయినట్టి; ఆ = ఆ; పరమేశ్వరుండు = భగవంతుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:
తండ్రీ! బలవంతులైన రాక్షసులు నా బిడ్డలైన దేవతలను అదలించి బెదరించి స్వర్గ లోకాన్ని పాలిస్తున్నారు. కన్నకడుపు కదా. ఆ బెంగతో దేవతల కన్నతల్లిని అయిన నాకు నాటి నుండి కంటికి నిద్ర కరువైంది. ఈ నా గర్భశోకాన్ని పోగొట్టి కాపాడు.'' అని పలికిన అదితి మాటలు విని శ్రీ మహా విష్ణువు చిరునవ్వు చిందించాడు. శరణు వేడిన వారికి కామధేనువు అయిన ఆ పరమాత్ముడు అదితితో ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=66&Padyam=484

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :