Wednesday, March 22, 2017

మత్స్యావతార కథ - 13:

8-713-వ.
అంత న మ్మహారాత్రి యందు
8-714-మ.
నెఱి నెల్లప్పుడు నిల్చి ప్రాణిచయమున్ నిర్మించి నిర్మించి వీఁ
పిఱయన్ నీల్గుచు నావులించుచు నజుం డే సృష్టియున్ మాని మే
నొఱఁగన్ ఱెప్పలు మూసి కేల్ దలగడై యుండంగ నిద్రించుచున్
గుఱు పెట్టం దొడఁగెం గలల్ గనుచు నిర్ఘోషించుచున్ భూవరా!

భావము:
అట్టి బ్రహ్మదేవుని రాత్రి సమయం అయిన మహా ప్రళయ కాలంలో. రాజ్యాన్ని ఏలే రాజా పరీక్షిత్తూ! అవిశ్రాంతంగా కూర్చుని ఓర్పుతో ప్రాణులను సృష్టించి జన్మించుట లేని వాడు అగు బ్రహ్మదేవుడు అలసిపోయాడు. వీపు నడుము నొచ్చసాగాయి. అతడు ఒళ్ళు విరుచుకుంటూ, ఆవులిస్తూ సృష్టికార్యాన్ని ఆపాడు. నడుం వాల్చి, కళ్ళు మూసికొని, చెయ్యి తలగడగా పెట్టుకున్నాడు. గురకలు పెడుతూ కలలు కంటూ ఒళ్ళుతెలియక నిద్రపోయాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=88&padyam=714

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Tuesday, March 21, 2017

మత్స్యావతార కథ - 12:

8-711-వ.
తదనంతరంబ
8-712-తే.
మున్ను పోయిన కల్పాంతమున నరేంద్ర!
బ్రహ్మ మనఁగ నైమిత్తిక ప్రళయ వేళ
నింగిపై నిట్టతొలఁకు మున్నీటిలోనఁ
గూలె భూతాళి జగముల కొలఁదు లెడలి.

భావము:
తరువాత పరీక్షిత్తు మహారాజా! గడచిపోయిన కల్పం అంతం కాగా, బ్రహ్మప్రళయం అనే నైమిత్తిక ప్రళయం ఏర్పడింది. సముద్రాలు చెలియలి కట్టలు దాటాయి. నిట్టనిలువుగా ఆకాశమంత లేచిన అలల సముద్రంలో లోకాల సరిహద్దులు చెరిగిపోయాయి. ప్రాణులు సమస్తం కూలిపోయాయి.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=88&padyam=712

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Monday, March 20, 2017

మత్స్యావతార కథ - 11:

8-709-వ.
అంతఁ గల్పాంతంబు డాసిన
8-710-క.
ఉల్లసిత మేఘ పంక్తులు
జల్లించి మహోగ్రవృష్టి జడిగొని కురియన్
వెల్లి విరిసి జలరాసులు
చెల్లెలి కట్టలను దాఁటి సీమల ముంచెన్.

భావము: 
ఇంతలో ప్రళయ సమయం దగ్గరపడగా.... మెరపులతో కూడిన మేఘాలు ఎడతెరపి లేకుండా బహుభయంకరమైన వర్షపు జడులు కురుస్తున్నాయి, సముద్రాలు చెలియలికట్ట దాటి పొంగిపొరలి దేశాలను ముంచేస్తున్నాయి.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=87&Padyam=710

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Sunday, March 19, 2017

మత్స్యావతార కథ - 10:8-707-వ.
మఱియు న న్నావ మున్నీటి కరళ్ళకు లోనుఁ గాకుండ, నిరుఁ గెలం కుల వెనుక ముందట నేమఱకుండఁ, బెన్నెఱుఁలగు నా గఱులన్ జడి యుచుఁ బొడువ వచ్చిన బలుగ్రాహంబుల నొడియుచు సంచరించెద; ఒక్క పెనుఁబాము చేరువ నా యనుమతిం బొడచూపెడు దానంజేసి సుడిగాడ్పుల కతంబున నావ వడిం దిరుగంబడకుండ నా కొమ్ము తుదిం పదిలము చేసి నీకునుఁ దపసులకును నలజడి చెందకుండ మున్నీట ని ప్పాటం దమ్మిచూలి రేయి వేగునంతకు మెలంగెద; నది కారణంబుగా జలచర రూపంబుఁ గయికొంటి; మఱియు నొక ప్రయోజనంబుఁ గలదు; నా మహిమ పరబ్రహ్మం బని తెలియుము; నిన్ను ననుగ్రహించితి" నని సత్యవ్రతుండు చూడ హరి తిరోహితుం డయ్యె; అయ్యవసరంబున.
8-708-ఆ.
మత్స్యరూపి యైన మాధవు నుడుగులుఁ
దలఁచికొనుచు రాచతపసి యొక్క
దర్భశయ్యఁ దూర్పుఁ దలగడగాఁ బండి
కాచి యుండె నాఁటి కాలమునకు.

భావము:
మత్స్యరూపం ధరించిన నేను ఆ ఓడ సముద్రం అలలకు దెబ్బతినకుండా అన్నివైపులా నా పెద్ద ఈకలతో కూడిన నా రెక్కలను కదిలిస్తూ ఉంటాను. నావను ముక్కలు చేయడానిక వచ్చే పెద్ద పెద్ద జలచరాలను తరిమేస్తూ ఉంటాను. ఒక పెద్ద పాము నా ఆజ్ఞానుసారం, అక్కడ కనిపిస్తుంది. సుడిగాలులకు నావ తిరగబడకుండా ఆ పాముతో నా కొమ్ముకొనకు ఆ నావను బంధించు. నీకూ మునీశ్వరులకూ చేటు వాటిల్లకుండా ఆ ప్రళయకాలం గడిచేంతవరకు నేను రక్షిస్తూ ఉంటాను. ఇందుకోసమే నేను ఈ మీనరూపం ధరించాను. ఇంకోక విశేష ప్రయోజనం కూడా ఉన్నది అనుకో. పరబ్రహ్మ స్వరూపమైన నా మహిమ తెలుసుకో. మరి నేను నిన్ను అనుగ్రహిస్తాను.” ఇలా పలికి శ్రీమన్నారాయణుడు ఆ సత్యవ్రత మహారాజు చూస్తుండగా అదృశ్యం అయ్యాడు. అలా శ్రీ మహా విష్ణువు చేప రూపంతో చెప్పిన విషయాలను తలచుకుంటూ, తపశ్శాలి అయిన సత్యవ్రత మహారాజు తూర్పువైపుగా తలగడ పెట్టుకుని దర్బల శయ్యమీద పరుండి మీన రూపుడు చెప్పిన ప్రళయ సమయం కోసం వేచి ఉన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=87&Padyam=708

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Saturday, March 18, 2017

మత్స్యావతార కథ - 9:8-705-వ.
అని పలుకు సత్యవ్రత మహారాజునకు నయ్యుగంబు కడపటఁ బ్రళయ వేళ సముద్రంబున నేకాంతజన ప్రీతుండయి విహరింప నిచ్ఛించి మీన రూపధరుండైన హరి యిట్లనియె.
8-706-సీ.
"ఇటమీఁద నీ రాత్రికేడవదినమునఁ;
బద్మగర్భున కొక్క పగలు నిండు;
భూర్భువాదిక జగంబులు మూఁడు విలయాబ్ధి;
లోన మునుంగు; నాలోనఁ బెద్ద
నావ చేరఁగ వచ్చు; నా పంపు పెంపున;
దానిపై నోషధితతులు బీజ
రాసులు నిడి పయోరాశిలో విహరింపఁ;
గలవు సప్తర్షులుఁ గలసి తిరుఁగ
8-706.1-ఆ.
మ్రోలఁ గాన రాక ముంచు పెంజీఁకటి
మిడుకుచుండు మునుల మేనివెలుఁగుఁ
దొలకుచుండు జలధి దోధూయమాన మై
నావ దేలుచుండు నరవరేణ్య!

భావము:
ఇలా సత్యవ్రత మహారాజు ఈ మత్స్యావతార కారణం చెప్పమని అడిగాడు. ఆ యుగం చివర కాలంలోని ప్రణయవేళ సముద్రంలో ఒంటరిగా సంచరించాలని భావిస్తున్న శ్రీమహావిష్ణువు సత్యవ్రతునితో ఇలా అన్నాడు. “ఓ రాజా! ఈ రాత్రి గడచిన పిమ్మట రాబోయే ఏడవ నాటితో బ్రహ్మదేవుడికి ఒక పగలు పూర్తి అవుతోంది. భూలోకం మొదలు మూడులోకాలూ ప్రళయసముద్రంలో మునుగుతాయి. అప్పుడు నా ఆజ్ఞానుసారం ఒక పెద్ద నావ నీ దగ్గరకు వస్తుంది. అప్పుడు నీవు సమస్త ఓషధులు, విత్తనాల రాసులూ ఆ నౌకపై పెట్టుకుని ప్రళయసముద్రంలో విహరించు. సప్తఋషులు నీతో కలిసి ఆ ఓడలో ఉంటారు. మీ ముందు అంతా పెనుచీకటి ఆవరిస్తుంది. మునుల మేని కాంతులు మిణుకు మిణుకు అంటూ మెరుస్తుంటాయి. సముద్రంలో నావ ఊగుతూ తేలుతూ సాగిపోతూ ఉంటుంది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=87&Padyam=706

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Friday, March 17, 2017

మత్స్యావతార కథ - 8:8-703-క.
ఇతరులముఁ గాము చిత్సం
గతులము మా పాలి నీవుఁ గలిగితి భక్త
స్థితుఁడవగు నిన్ను నెప్పుడు
నతి చేసినవాని కేల నాశముఁ గలుగున్.
8-704-క.
శ్రీలలనాకుచవేదికఁ
గేళీపరతంత్రబుద్ధిఁ గ్రీడించు సుఖా
లోలుఁడవు దామసాకృతి
నేలా మత్స్యంబ వైతి వెఱిఁగింపు హరీ!

భావము:
మేము నీకు పరాయివాళ్ళం కాదు. నిర్మల జ్ఞానం కలవాళ్ళము. మాకు అండగా నీవు ఉంటావు. భక్తులలో నివసించే వాడవు నీవు. నీకు నిత్యం నమస్కరించే వాడికి చేటు కలుగనే కలుగదు కదా. హరీ! లక్ష్మీదేవి వక్షస్థలంపై క్రీడిస్తూ సంతోషంగా విహరించే ఆనందస్వరూపుడవు. తామస ప్రకృతితో తిరిగే చేప రూపాన్ని ఎందుకు ధరించావో తెలుపుమయ్యా!”

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=86&Padyam=704

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Thursday, March 16, 2017

మత్స్యావతార కథ - 7:


8-702-సీ.
ఒక దినంబున శతయోజనమాత్రము;
విస్తరించెదు నీవు; వినము చూడ
మిటువంటి ఝషముల నెన్నఁడు నెఱుఁగము;
మీనజాతుల కిట్టి మేను గలదె?
యేమిటి కెవ్వఁడ? వీ లీలఁ ద్రిప్పెదు;
కరుణ నా పన్నులఁ గావ వేఁడి
యంభశ్చరంబైన హరివి నే నెఱిఁగితి;
నవ్యయ నారాయణాభిధాన
8-702.1-తే.
జనన సంస్థితి సంహార చతురచిత్త!
దీనులకు భక్తులకు మాకు దిక్కు నీవ;
నీదు లీలావతారముల్ నిఖిలభూత
భూతి హేతువుల్ మ్రొక్కెదఁ బురుషవర్య!

భావము:
“ఒక్క రోజులో నూరు యోజనాల మేర పెరిగిపోయావు. ఇలాంటి చేపలను మేము ఎప్పుడూ కనివిని ఎరుగము. ఝషజాతులకు ఎక్కడా ఇలాంటి శరీరం ఉండదు. నీవు ఎవరవు? ఎందుకోసం నన్ను తిప్పలమ్మట తిప్పుతున్నావు. దీనులను కాపాడటానికి ఈ మహా మీన రూపం ధరించిన నీవు విష్ణువే అని గతెలుసుకున్నాను. అచ్యుతా! నారాయణా! పురుషోత్తమా! లోకాలను సృష్టించి పోషించి లయం చేసుకునే మహానుభావుడవు నీవే. దీనులకు, భక్తులకు నీవే దిక్కు. మహిమాన్వితమైన నీ లీలావతారాలు సర్వ ప్రాణులకూ మేలు కలిగిస్తాయి. అటువంటి నీకు మ్రొక్కుతున్నాను.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=86&Padyam=702

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :